కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కాదయా!

Indians Face Problems In Foreign Countries Over Coronavirus - Sakshi

విదేశాల నుంచి నగరానికి రావాలంటే ఎన్ని తంటాలో..

ఆస్పత్రిలో ఉన్న తల్లిని చూసేందుకు ధ్రువీకరణ పత్రం

ఆమె ఆరోగ్యం క్షీణించిందని వైద్యుల సర్టిఫికెట్‌

ఆ తర్వాతే అనుమతించిన అమెరికన్‌ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీనగర్‌ కాలనీలోని సాయిరాం మనోర్‌ టొపాజ్‌ బ్లాక్‌లో నివసిస్తున్న సులోచన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ పూర్తిగా స్పృహ కోల్పోయి రెండు రోజుల క్రితం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒక్కగానొక్క కొడుకు ప్రశాంత్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా నుంచి ఇండియాకు రావాలంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆయన పడుతున్న తంటాలు అద్దం పడుతున్నాయి. తల్లిని చూసేందుకు ఇండియాకు రావాలని ప్రశాంత్‌ మూడు రోజులుగా ప్రయత్నిస్తుంటే ‘మీ తల్లి ఆరోగ్యం క్షీణించిందన్న విషయాన్ని వైద్యులతో ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని’ అమెరికన్‌ అధికారులు తెలిపారు. (168కి చేరిన కరోనా కేసులు)

దీంతో యశోద ఆస్పత్రి వైద్యులు ఆమె అనారోగ్య పరిస్థితిపై ఓ లేఖను ఇవ్వడంతో తండ్రి కుప్పురాం దాన్ని కొడుకుకు పోస్ట్‌ చేశాడు. ఈ లేఖను అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో అందజేసిన అనంతరం ఇండియాకు వెళ్లేందుకు వీసా మంజూరైంది. నేరుగా హైదరాబాద్‌కు రావడానికి వీల్లేకుండా పోవడంతో ఆయన బుధవారం అక్కడి నుంచి బయల్దేరి సింగపూర్‌లో దిగి గురువారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దాదాపు ఇండియా నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు వెళ్లేవారికి, అటు వైపు నుంచి వటు వచ్చేవారికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. చావుబతుకుల్లో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు కూడా అక్కడి నుంచి అనుమతి లభించడం లేదు. (కరోనా అలర్ట్‌: ఎయిర్‌పోర్టు ఖాళీ!)

తప్పనిసరిగా రావాలంటే ఎన్నో పత్రాలను జతపరచాల్సి వస్తున్నదని వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు ఏబీ కుప్పురాం తెలిపారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆయా దేశాల్లో తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు ఇక్కడి వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆయన తెలిపారు. కొడుకు వచ్చేదాకా తల్లిని వెంటిలేటర్‌పై ఉంచాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అమెరికాకు వెళ్ళాలనుకొని టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు అక్కడి నుంచి సెలవులకు ఇక్కడికి రావాలనుకునేవారు కూడా తమ టిక్కెట్లను క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వస్తోంది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top