అక్రమంగా కందుల అమ్మకాలు

illegal selling of toor dal in jadcherla - Sakshi

జడ్చర్లలో 17 బస్తాలు పట్టుకున్న మార్కెట్‌ చైర్‌పర్సన్‌

జడ్చర్ల : రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన కందులను ప్రభుత్వ మద్దతు ధరకు సంబంధిత ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించే ప్రయత్నం చేస్తున్న ఓ కమీషన్‌ ఏజెంట్‌ను మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం జడ్చర్ల మార్కెట్‌ యార్డులో చోటుచేసుకుంది. చైర్‌పర్సన్‌ శోభ కథనం ప్రకారం.. జడ్చర్ల పత్తి మార్కెట్‌ యార్డులో కందుల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం హాకా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్వింటాల్‌కు ప్రభుత్వం మద్దతు ధరను రూ.5,450గా నిర్ణయించింది. అయితే బయట మార్కెట్‌లో రైతులకు ఆ ధరలు దక్కడం లేదు. క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,500 లోపే ధరలు దక్కుతున్నాయి. అయితే కొందరు వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు తదితర చిల్లర వ్యాపారులు సైతం రైతుల వద్ద నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన కందులను తిరిగి వారి  పేరున హాకా కొనుగోలు కేంద్రంలో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ శోభ, పాలక మండల సభ్యులు సదరు వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి కందుల కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా సహకరించాలని, మధ్య దళారీల ప్రమేయం లేకుండా చూడాలని సూచించారు. 

రైతు పేరున విక్రయం.. 

ఈ నేపథ్యంలో విక్రయాలపై దృష్టిసారించి నిత్యం పర్యవేక్షణ పెంచగా శుక్రవారం ఉదయం మిడ్జిల్‌ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు ద్వారా బాదేపల్లి యార్డు కమీషన్‌ ఏజెంట్‌ వాసవీ  ట్రేడర్స్‌ సతీష్‌ 17 బస్తాల కందులను హాకా కేంద్రంలో విక్రయించేందుకు ప్రయత్నించగా రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నట్లు చైర్‌పర్సన్‌ తెలిపారు. సదరు రైతు ఆంజనేయులుకు సంబంధించిన ఫోన్‌ను కూడా స్వాధీనపరుచుకుని అందులో కాల్‌డేటాను పరిశీలించగా రైతు, కమీషన్‌ ఏజెంట్‌ మాట్లాడుకున్న సమాచారం ఉందన్నారు. అంతేకాక బైరంపల్లి గ్రామ పరిధిలో ఆంజనేయులు సాగు చేసిన కందిపంటకు వచ్చిన దిగుబడికి ఎక్కడా పొంతన లేదన్నారు. దీంతో కమీషన్‌ ఏజెంట్‌ సతీష్‌ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన కందులను మద్దతు ధరకు హాకా కేంద్రంలో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు రుజువయ్యిందన్నారు. వెంటనే ధాన్యాన్ని స్వాధీనపరుచుకుని తహసీల్దార్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. అంతేగాక కమీషన్‌ ఏజెంట్‌ లైసెన్‌ రద్దుపరిచి చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ శ్రీశైలం, డైరెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మొగులయ్య, యార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top