‘ప్లేటు’ మారిందో..వాత పడిందే!

Hyderabad Traffic Police Special Drive on Number Plates - Sakshi

ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసులు

వాహనాల గజిబిజి నంబర్‌ ప్లేట్లపై గురి

తీవ్రమైన వాటిపై క్రిమినల్‌ కేసులు నమోదు  

స్వయంగా పర్యవేక్షిస్తున్న నగర ట్రాఫిక్‌ చీఫ్‌

సాక్షి,సిటీబ్యూరో: నగర రోడ్లపై తిరిగే లక్షలాది వాహనాలు.. ప్రతిదానికి నంబర్‌ ప్లేట్‌ ఉంటుంది. కానీ అవేవీ ఒకే విధంగా ముఖ్యంగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండవు. ఆయా నంబర్‌ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలతో ఉంటాయి. అంతేనా.. అంకెలు కూడా చెప్పలేనన్ని వంకర్లతో గుర్తించలేనంతగా ఉంటాయి. ఇటీవల కాలంలో నగరంలోని అనేక వాహనాలకు ఈ తరహా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్లే అధికమైపోయాయి. దీనికి చెక్‌ పెట్టేందుకు ‘స్పెషల్‌ డ్రైవ్‌’ చేపట్టాలని నగర ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహించి భారీగా కేసులు సైతం నమోదు చేశారు. ఈ చర్యలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై నగర ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ దృష్టిపెట్టి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం డీసీపీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌తో కలిసి విస్తృత స్థాయి సమీక్ష సైతం నిర్వహించారు. నంబర్‌ ప్లేట్‌లో ఉండే అక్షరాలు, అంకెల ఆకారం, పరిమాణం కచ్చితంగా మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్‌)లో నిర్దేశించిన ప్రకారమే ఉండాలి. కానీ ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో ఈ–చలాన్‌ తప్పించుకోవడం కోసం ట్రాఫిక్‌ కెమెరాల కళ్లు కప్పడానికి కొందరు వీటిని ఫ్యాన్సీగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో తప్పుడు నంబర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు.

పోలీసులకు సవాల్‌ విసురుతున్న ‘ఉల్లంఘనులు’
నేరాలు చేయడానికి వాహనాలు వాడే వారు సైతం సక్రమంగా లేని నంబర్‌ ప్లేట్లు వినియోగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనివల్ల ఉల్లంఘనులు తప్పించుకవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో భద్రతా పరమైన ఇబ్బందులూ తలెత్తుతాయని చెబుతున్నారు. ఈ అంశాలతో పాటు వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్‌పై ‘పోలీసు, ప్రభుత్వ వాహనం, కార్పొరేటర్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ’ ఇలా ఎలాంటి అక్షరాలు, అంశాలు రాయడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్‌ 50, 51 ఉల్లంఘించడమేనని అధికారులు వివరిస్తున్నారు. తప్పుడు నంబర్‌ ప్లేట్స్‌ కలిగి ఉండటం, వాటిలో అంకెలు, అక్షరాల్లో మార్పులు చేయడం వంటి చర్యలకు ఉద్దేశ పూర్వకంగా పాల్పడినట్లు గుర్తిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్రమ నంబర్‌ ప్లేట్ల కారణంగా ఈ–చలాన్‌ నుంచి తప్పించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఉగ్రవాదుల కదలికలు సైతం కనిపెట్టడం కష్టంగా మారిందంటున్నారు. అనేక చోరీ వాహనాలు సైతం స్వేచ్ఛగా నగరంలో తిరుగుతున్నాయని వివరిస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు, నేరగాళ్లను గమనించిన ప్రజలు సైతం స్పందించాలని ట్రాఫిక్‌ అధికారులు కోరుతున్నారు. వాటిని ఫొటో తీసి ట్రాఫిక్‌ పోలీసు ఫేస్‌బుక్, ట్విటర్‌లతో పాటు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 90102 03626కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నంబర్‌ స్పష్టంగా కనిపించేలా ఫొటో ఉండటంతో పాటు తేదీ, సమయం, ప్రదేశం కచ్చితంగా స్పష్టం చేస్తున్నారు.  

నిబంధనలు ఇవే..
ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్‌ ఉండాలి.  
కమర్షియల్, గూడ్స్‌ వాహనాలకు పసుపు రంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్‌ ఉండాలి.
నంబర్‌ ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు తదితరాలు నిషేధం.  
ఎవరైనా బోగస్‌ నంబర్‌ ప్లేటు వినియోగిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు ఆర్టీఏ అధికా>రుల సహాయంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ సైతం రద్దు చేస్తారు.  
ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్‌ ప్లేట్‌ 200 ఇంటూ 100 మిల్లీ మీటర్లు, తేలికపాటి వాహనాలు, ప్యాసింజర్‌ కార్లకు 340 ఇంటూ 200 మిల్లీ మీటర్లు లేదా 500 ఇంటూ 120 మిల్లీ మీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్‌ వాహనాలకు 340 ఇంటూ 200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి.

నంబర్‌ ప్లేట్‌ ఉల్లంఘనకుసంబంధించి 2017 నుంచినమోదు చేసిన కేసులు ఇవీ.. 
2017    36,632
2018    71,324
2019    17,486 (మార్చి)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top