స్థూల'ఖాయమే'!

Hyderabad People Suffering With Obesity - Sakshi

వయసు 20.. బరువు 80

నగర యువతీ యువకుల్లో ఊబకాయం   

30 శాతం మందిని వేధిస్తున్న సమస్య

గరిష్ట బరువు కంటే 8–15 కిలోలు అధికం

ఎక్కువ కేలరీల ఆహారమే ప్రధాన కారణం  

జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండకుంటే ప్రమాదం

ఆటలు, శారీరక శ్రమ, వ్యాయామం తప్పనిసరి

యువత అంటే ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు.. అనే నిర్వచనం క్రమంగా మారుతోంది. వారిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. ప్రధానంగాకళాశాలలకు వెళ్లే వయసులో చాలామందిఊబకాయంతో బాధపడుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టడం తప్ప ఆటలకు దూరంగా ఉంటున్నారు. చిన్న వయసులోనే ఇది అధిక బరువు సమస్యకు దారి తీస్తోంది. నగర యువతలో దాదాపు 30 శాతం మంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యువతుల్లో ఈ సమస్య ఎక్కువ ఉందని చెబుతున్నారు. 16 నుంచిపాతికేళ్ల వయసున్న వారిలో గరిష్ట బరువు కంటే 8– 15 కిలోలు అధికంగా ఉన్నట్లు స్పష్టంచేస్తున్నారు. 20 సంవత్సరాలకే 80 కిలోలు ఉండటంతో పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అధిక కేలరీల ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం ఇతరేతర కారణాలతో స్థూలకాయం వస్తుందంటున్నారు. నగరంలోని యువతలో పెరుగుతున్న స్థూలకాయం, కారణాలు, పరిష్కారం తదితర అంశాలపై ‘సాక్షి’ కథనం. 

శారీరక శ్రమ లేక..
చాలామంది యువతీ యువకుల్లో శారీరక శ్రమ ఉండటం లేదు. స్మార్ట్‌ఫోన్లు చేతిలోకి వచ్చాక.. ఆటలకు దూరమవుతున్నారు. చాలా పాఠశాలలు, కళాశాలల్లో ఆటలకు ప్రాధాన్యం తగ్గుతోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. చదువుతోపాటు ఆటల వైపు పిల్లలను ప్రోత్సహించాలి. ఫలితంగా వారికి శారీరక శ్రమ అలవాటు అవుతుంది. యువతీ, యువకులు చదువుతోపాటు శారీరక శ్రమపై దృష్టి పెట్టాలి. నిత్యం గంటపాటు వ్యాయామం చేయాలి. చెమట వచ్చేలా ఏదైనా పని చేయవచ్చు. క్రికెట్, ఫుడ్‌బాల్, తాడాట, ఈత, తోట పని, వేగవంతమైన నడక ఇలా ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి.  

మితమే హితం..
ఆహారం విషయంలో మితం పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తక్కువగా తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు నిత్యం 500 గ్రాములకు తక్కువ కాకుండా చూసుకోవాలి. ఉదయం అల్పాహారం ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఆకు కూరలు, కాయగూరలు, గుడ్డు, చేపలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట 8 గంటలలోపు భోజనం ముగించాలి. సమతుల ఆహారానికి ప్రాధాన్యమిస్తూ.. జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని న్యూట్రిషన్‌ నిపుణులు చెబుతున్నారు.    

ఒకేచోట అతుక్కుపోతూ..
చాలామంది కూర్చున్న చోటు నుంచి కదలటానికి ఇష్టపడరు. కంప్యూటర్, సెల్‌ఫోన్, టీవీలకు గంటల తరబడి అతుక్కుపోతుంటారు. అక్కడే భోజనం కానిస్తుంటారు.  చాలామంది ఇంట్లో పనులకు దూరంగా ఉంటున్నారు. ఇళ్లు ఊడవటం.. దుస్తులు ఉతకటం.. గార్డెనింగ్‌ లాంటి పనులను పని మనుషులకు అప్పగిస్తున్నారు. చిన్నచిన్న పనులు పిల్లలకు అప్పగించక పోవడం వల్ల వారిలో సోమరితనాన్ని పెంచి పోషించినట్లు అవుతోంది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న చాలా ఇళ్లలో పిల్లల తిండిపై శ్రద్ధ ఉండటం లేదు. అమ్మానాన్నలతోపాటు పిల్లలకు బయట తిండే అలవాటవుతోంది. మసాలాలు, నూనెలతో కూడిన ఆహారం వల్ల తెలియకుండానే వారిలో అధిక బరువుకు దారి తీస్తోంది.

రోడ్‌సైడ్‌ ఫుడ్‌తో..
రోడ్‌సైడ్‌ ఆహారంలో ఎక్కువ శాతం మసాలాలు, నూనెలు వాడుతుంటారు. తరచూ ఇదే ఆహారం తీసుకోవడంతో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఒకసారి బరువు పెరిగితే తగ్గించుకోవాలంటే కష్టం. స్థూలకాయం ఎన్నో రకాల శారీరక, మానసిక రుగ్మతలకు హేతువుగా గుర్తించాల్సిన అవసరముంది. వ్యక్తిగతంగా, కేరీర్‌ పరంగానూ ఇబ్బందే. యువతకు ఈ సమస్య మరింత నష్టం కలిగిస్తోంది. ఎలాంటి ఆహారం తింటున్నామో.. ఎంత తింటున్నామో.. అనే విషయంపై నిత్యం అవగాహనతో ఉండాలి. యుక్త వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలకు అధిక బరువు ప్రధాన కారణం. కొందరిలో ఇది తీవ్రమైన కుంగుబాటుకు దారి తీస్తుందని గుర్తించాలి. ఈ విషయంలో యువతీయువకులు తగినంత జాగ్రత్త వహించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top