హాస్టలర్స్‌ అందోళన: స్పందించిన కేటీఆర్‌, డీజీపీ

Hyderabad Hostels Shutdown: KTR And DGP React on This Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలోని హాస్టళ్లు, పీజీ మెస్‌లు మూసివేయాల్సిన అవసరం లేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ విస్పష్ట ప్రకటన చేశారు. బుధవారం సాయంత్రం నుంచి హస్టళ్లు మూసివేస్తున్నారని అసత్య ప్రచారం జరుగుతుండటంతో హాస్టలర్స్‌ అయోమయానికి గురైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమను తమ ఊళ్లకు పంపించాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. దీంతో హాస్టలర్స్‌ ఆందోళన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ వారి సమస్యలపై స్పందించారు. 

హాస్టళ్ల యజమానులతో సంప్రదింపులు జరపాలని నగర కమిషనర్‌కు, మేయర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన నగర మేయర్‌, పోలీస్‌ కమిషనర్‌ పరిస్థితిని సమీక్షించారు. అనంతరం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. హాస్టళ్లు మూసివేస్తున్నారనేది తప్పుడు వార్త అని కొట్టి పారేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఒక్క హాస్టల్‌ కూడా మూసివేయలేదని తెలిపారు. అవసరమైతే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేస్తామని మేయర్‌ పేర్కొనడంతో హాస్టలర్స్‌కు కాస్త ఊరట లభించింది.  దీంతో తిరిగి హాస్టల్స్‌కు, పీజీ మెస్‌లకు విద్యార్థులు, ఉద్యోగులు చేరుకుంటున్నారు.

హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించొద్దు: తెలంగాణ డీజీపీ
లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top