ఎందుకో.. ఏమో? 

HMDA Sale For Plots In Uppal Bhagayath Nagar - Sakshi

ఉప్పల్‌ భగాయత్‌లో మరో లక్ష గజాలు     

వీటిపై దృష్టిసారించని హెచ్‌ఎండీఏ  

విక్రయిస్తే దాదాపు రూ.600 కోట్ల ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ఉప్పల్‌ భగాయత్‌ వరంగా మారింది. ఇప్పటికే ఏప్రిల్‌లో ఈ–వేలం వేసిన 67 ప్లాట్లతో రూ.677 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే అవి పోగా ఇంకా లక్ష గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉండగా... వాటిపై హెచ్‌ఎండీఏ ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, స్ట్రీట్‌ లైట్లు తదితర సౌకర్యాల కల్పన కూడా పూర్తయింది. కానీ అధికారులు మాత్రం ఈ–వేలంలో జాప్యం చేస్తున్నారు. ఈ ప్లాట్లను విక్రయిస్తే గజానికి రూ.40వేల నుంచి రూ.60వేల వరకు పలికినా సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది.

ఈ నిధులతో శివారు ప్రాంతాల అభివృద్ధి వేగిరమయ్యే చాన్స్‌ ఉంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏకు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా సమకూరిన రూ.వెయ్యి కోట్లతో పాటు ఉప్పల్‌ భగాయత్‌లోని 67 ప్లాట్ల విక్రయం ద్వారా వచ్చిన రూ.677 కోట్లను దశల వారీగా శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేస్తున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు గ్రోత్‌ కారిడార్‌లో రేడియల్‌ రోడ్లు, స్పైక్‌ రోడ్ల అభివృద్ధికి రూ.వందల కోట్లు అవసరం ఉండడంతో ఈ ప్లాట్లను వేలం వేస్తే మంచిదని హెచ్‌ఎండీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాకే ఈ–వేలం నిర్వహించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

మెట్రో రాకతో డిమాండ్‌...   
2005లో ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్‌ కన్జర్వేషన్‌ అండ్‌ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా ల్యాండ్‌పూలింగ్‌ కింద ఉప్పల్‌ భగాయత్‌ రైతుల నుంచి 733 ఎకరాలను సేకరించింది. ఇందులో మెట్రో రైలు డిపో, జలమండలి మురుగు శుద్ధి నీటి కేంద్రం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత కేటాయించింది. మిగిలిన 413.32 ఎకరాల్లో 20,00,468 చదరపు గజాల్లో ఉప్పల్‌ భగాయత్‌ పేరుతో లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. రాష్ట్ర విభజన, కోర్టు కేసులు, యూఎల్‌సీ భూములు ఉండడంతో భూములు కోల్పోయిన రైతులకు ఆలస్యంగానైనా 2017 మార్చిలో 1,520 మందికి లాటరీ రూపంలో ప్లాట్లు కేటాయించారు. ఎకరం భూమి కోల్పోయిన వారికి వేయి గజాల చొప్పున కేటాయించారు.

8,84,205 చదరపు గజాల్లో లేఅవుట్‌ వేస్తే 7,58,242 చదరపు గజాలను 1,520 మందికి ప్లాట్లుగా ఇచ్చారు. వీరికిపోను అభివృద్ధి చేసిన 1,25,963 చదరపు అడుగుల్లో ఉన్న 67 ప్లాట్లను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌ వేలం వేయగా రూ.667 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఇందులో రెండు ప్లాట్ల బిడ్డర్లు హెచ్‌ఎండీఏ నియమ నిబంధనల ప్రకారం అసలులో 25 శాతం డబ్బును చెల్లించకపోవడంతో రద్దు చేశారు. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న లక్ష గజాల విస్తీర్ణం ప్లాట్లలో ఎక్కువగా 200 నుంచి రెండు వేల గజాల మధ్య ఉన్నవే అత్యధికంగా ఉన్నాయి. ప్లాట్‌ సైజు, లొకేషన్‌ బట్టి గజానికి ధరను రూ.30వేల నుంచి రూ.35 వేల వరకు నిర్ణయించే అవకాశముందని హెచ్‌ఎండీఏ వర్గాలు అంటున్నాయి. ఇదికాకుండా ఉప్పల్‌ భగాయత్‌కు సమీపంలోనే మరో 120 ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో సాధ్యమైనంత తొందరగా వీటిని కూడా ప్లాట్లు చేస్తే సంస్థకు కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top