
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏటూరునాగారం సబ్ డివిజన్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సమ్మక్కసారలమ్మ మండలం మేడారంలో జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. లోలేవల్ కాజేవే పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో వాహనాలు జలదిగ్భందంలో చిక్కుకుని రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం పొంగి ప్రవహిస్తున్న కారణంగా ఈ రోజు కూడా పర్యాటకులను అనుమతించటం లేదని అటవీ శాఖ అధికారి డోలి. శంకర్ తెలిపారు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.