భారీగా ఆహారశుద్ధి పరిశ్రమలు

Heavily food processing industries - Sakshi

ఏర్పాటుకు ప్రభుత్వ యోచన 

కలిసి రావాలని ఐటీసీ సంస్థకు సీఎం కేసీఆర్‌ సూచన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (ఆహార శుద్ధి) యూనిట్లు స్థాపించే విషయంలో ప్రభుత్వంతో కలిసి రావాలని సీఎం కేసీఆర్‌ ఐటీసీ లిమిటెడ్‌ను కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన, కల్తీలేని ఆహార పదార్ధాలు అందించే లక్ష్యంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఐటీసీ చైర్మన్‌ సంజీవ్‌ పురి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నకుల్‌ ఆనంద్, సీనియర్‌ అధికారులు సంజయ్‌ సింగ్, ఉషారాణి ప్రగతి భవన్‌లో శనివారం సీఎంతో సమావేశమయ్యారు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ సమీపంలో రూ.800 కోట్ల వ్యయంతో ఐటీసీ చేపట్టి న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రెండు మూడు నెలల్లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా సంజీవ్‌ పురి వివరించారు.

రాష్ట్రంలో అతిపెద్ద ఆహారశుద్ధి యూనిట్‌ను తక్కువ సమయంలోనే నిర్మించినందుకు సీఎం వారిని అభినందించారు. ‘వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర రావడం కోసం, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్థాలు అందడం కోసం పెద్ద ఎత్తున ఆహారశుద్ధి యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఈ రంగంలో అనుభవమున్న ఐటీసీ కలిసి రావాలి. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మహిళా సంఘాలున్నాయి. ముడి సరుకు సేకరణలో, ఇతర త్రా అంశాల్లో మహిళల సేవలను వినియోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పాలి. దీన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలి’అని సీఎం కోరారు.

ములుగు జిల్లాలో రేయాన్స్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఐటీసీ చొరవ చూపాలన్నారు. దీనికి ఐటీసీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ‘కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 500 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయాలు సిద్ధమవుతున్నాయి. వాటి చుట్టూ అందమైన ప్రకృతి ఆకృతి దాలుస్తోంది. రాష్ట్రంలో సహజ సిద్ధమైన అడవులున్నాయి. చారిత్రక ప్రదేశాలున్నా యి. ఇవన్నీ పర్యాటక కేంద్రాలుగా వెలుగొందే అవకాశం ఉంది. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ప్రభు త్వం ప్రయత్నాలు చేస్తోంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో ఐటీసీ కూడా కలిసి రావాలి’ అని ముఖ్యమంత్రి కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సీఎంఓముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top