గురుకులంలో సమస్యల దరువు

Gurukul School Problems Protest Students Warangal - Sakshi

నెక్కొండ: నెక్కొండ మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో పలు సమస్యలు తిష్టవేశాయి. శనివారం పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల.. అక్కడి పరిస్థితులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుకులం ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల విద్యార్థులకు హోంసిక్‌ సెలవులు, అలాగే ప్రతి రెండో శనివారం విద్యార్థులకు ఔటింగ్‌ ఉండడంతో ఉదయం పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకున్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో అద్దె భవనంలోని మొదటి అంతస్తులో పాఠశాల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా అటు విద్యార్థులు, ఇటు వారి తల్లిదండ్రులు కలుసుకునే చోటు లేకపోవడంతో.. పాఠశాల ఎస్‌ఓ రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు వారిని అనుమతించలేదు.

గంటల కొద్దీ రోడ్డుపై నిల్చున్న తల్లిదండ్రులు అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో రెండు గంటల పాటు జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా రోడ్డుపై వాహనాలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీపీ గటిక అజయ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింపజేసేందుక యత్నించినా తల్లిదండ్రులు వినలేదు. అధికారులు ఇక్కడి రావాంటూ డిమాండ్‌ చేశారు. దీంతో ఎంపీపీ, కొందరు తల్లిదండ్రులు, పాఠశాల ఎస్‌ఓతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఐదు నుంచి ఎనిమిదో తరగతుల వారి రెండు సెక్షన్లలో మొత్తం విద్యార్థులు 292 మంది ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు సరిపోను గదులు లేవని, పగటి వేళ తరగతులు నిర్వహిస్తుండగా అవే గదుల్లో రాత్రి నిద్రిస్తున్నారు.

కనీసం డైనింగ్‌ హాల్‌ కూడా లేదు. విద్యార్థుల కోసం పడకలు వచ్చినా కూడా గదుల కొరత కారణంగా పాఠశాలకు పంపిణీ చేయలేదని ఉపాధ్యాయులు తెలిపారు. స్నానపు గదుల్లో నీరు బయటికి సరిగా పోవడం లేదని విద్యార్థులు తెలిపారు. కాగా పాఠశాలలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీపీ హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించారు. వరంగల్‌లోని గణపతి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఉన్న గదుల్లో గురుకులాన్ని తరలించేందు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. నెక్కొండ సమీపంలోని పత్తిపాక గుట్ట వద్ద స్థల సేకరణ పూర్తయిందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top