మరో మూడు మార్గాల్లో మెట్రో దౌడ్‌

Government Planning Another Three Metro Ways In Hyderabad - Sakshi

ప్రభుత్వానికి డీపీఆర్‌ సమర్పించాం

ఆమోదం రాగానే పనులు ప్రారంభిస్తాం

మీడియా భేటీలో హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట్‌: మెట్రో రెండో దశలో భాగంగా మరో 3 మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు డీపీఆర్‌ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించామని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఈ పనులు ప్రారంభిస్తామన్నారు. మంగళవారం రసూల్‌పురాలోని మెట్రో భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాయదుర్గ్‌– శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వయా నానక్‌రాంగూడ రూట్లో 31 కి.మీ.లు, మియాపూర్‌–బీహెచ్‌ఈఎల్‌కు అక్క డి నుంచి వయా హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబోలి, ఓల్డ్‌ ముంబై హైవే, రేతిబౌలి, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌ మీదుగా లక్డీకాపూల్‌ కారి డార్‌ 1కు మరో 26 కి.మీ., నాగోల్‌– ఎల్‌బీనగర్‌ వరకు 5 కి.మీ. దూరం మేర రెండోదశ ప్రాజెక్టు చేపడతామన్నారు.

మొత్తం ఫేజ్‌– 2లో 62 కి.మీ. మెట్రో రైల్‌ మార్గం నిర్మించేందుకు డీపీఆర్‌ తయా రు చేసినట్లు చెప్పారు. నగరంలోని చాలా ప్రాంతాలవాసులు మెట్రో రైల్‌ విస్తరణ గురించి విజ్ఞప్తులు చేస్తున్నారని చెప్పారు. ఇందులో ఎల్‌బీనగర్‌– హయత్‌నగర్, తార్నాక– మెట్టుగూడ– ఈసీఐఎల్‌–మల్కాజ్‌గిరి, ప్యారడైజ్‌– మేడ్చల్‌ వరకు విస్తరించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు. ఫేజ్‌–1లో ప్రతి కిలోమీటర్‌ మెట్రో ఏర్పాటుకు రూ.230 కోట్లు ఖర్చు కాగా ఫేజ్‌–2లో రూ.300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. ఫేజ్‌– 1లో ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా రూట్లో (5 కి.మీ.) మార్గంలో మెట్రో నిర్మించాల్సి ఉందన్నారు. రోడ్డు విస్తరణకు కొన్ని చోట్ల కొన్ని మతాలకు సంబంధించిన భవనాలు, సమస్యాత్మక స్థలాలు అడ్డుగా ఉన్నాయన్నారు. మెట్రో స్పీడ్‌ పెంచాలని తాము రైల్వే సేఫ్టీ కమిషనర్‌ను కోరామని అన్ని రకాల పరీక్షలు పూర్తయ్యాయని త్వరలోనే స్పీడ్‌ పెరుగుతుందని తద్వారా ప్రీక్వెన్సీ కూడా పెంచుతామన్నారు.

రోజుకు వెయ్యి ట్రిప్పులు...
ప్రస్తుతం 55 రైళ్లను నడుపుతున్నామని, మరో రెండు రైళ్లను పరీక్షిస్తున్నామని 10 రోజుల్లో వాటిని కూడా అందుబాటులోకి తీసుకుని వస్తామని వివరించారు. గతంలో రోజూ 700 నుంచి 800 ట్రిప్పులు తిప్పే వారమని ప్రస్తుతం అది వెయ్యి ట్రిప్పులకు పెరిగిందన్నారు. ప్రతి రోజు నాలుగు లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారని అన్నారు. కారిడార్‌–1 నుంచి, కారిడార్‌–3 నుంచి అమీర్‌పేట్‌కు ఎక్కువగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో రాయ్‌దుర్గ్‌ రూట్‌లో సమస్య వస్తుందని అన్నారు. మెట్టుగూడ నుంచి రాయ్‌దుర్గ్‌ కొన్ని రైళ్లను, అమీర్‌పేట్‌ నుంచి రాయ్‌దుర్గ్‌కు అదనపు రైళ్లను తిప్పుతున్నామని వివరించారు.

మెట్రోకు అధికంగా భూములిచ్చారని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. కానీ, 3 మెట్రో డిపోలకు 212 ఎకరాలు, మరో 57 ఎకరాలు స్టేషన్ల కోసం మొత్తం 269 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. మియాపూర్‌ డిపో వద్ద ఇచ్చిన 100 ఎకరాల్లో డిపోకు 70 ఎకరాలు 30 ఎకరాలు వాణిజ్య సముదాయాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రతి కిలోమీటరు మెట్రో ఏర్పాటుకు ఢిల్లీలో 6 ఎకరాలు, నాగ్‌పూర్‌లో 7 ఎకరాలు, చెన్నైలో 4 ఎకరాలు ప్రభుత్వం కేటాయించిందని.. హైదరాబాద్‌ మెట్రోకు కి.మీ.కు 4 ఎకరాలు మాత్రమే కేటాయించారన్నారు. మెట్రో ఏర్పాటుకు ఎల్‌అండ్‌టీ తీసుకున్న రుణానికి వాణిజ్య బ్యాంకులకు ఏటా 11 శాతం వడ్డీ చెల్లిస్తున్నారని చెప్పారు. ప్రతి ఏడాది రూ.1,300 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. మెట్రోకు రోజుకు రూ.కోటి.. ఏటా రూ.480 కోట్ల ఆదాయం లభిస్తుం దన్నారు. ఇందులో రూ.365 కోట్లు చార్జీలు మిగతాది మెట్రో మాల్స్‌ ద్వారా లభిస్తోందన్నారు.

తిరుపతి మెట్రో కోసం ప్రాథమికంగా పరిశీలించాం..
తిరుమల తిరుపతి మెట్రో రైల్‌ కోసం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కోరిక మేరకు మూడు రోజుల పాటు ప్రాథమికంగా పరిశీలన మాత్రమే చేశామని ఎన్‌వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల మార్గంలో అత్యధిక మలుపుతో ఉన్న ఘాట్‌రోడ్డు ఉందని, అలాగే అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యం ఉండటంతో అన్నీ పరిశీలించాల్సి ఉంటుందన్నారు. గతంలో రోప్‌వే నిర్మాణానికి ఆగమశాస్త్రం ఒప్పుకోలేదని, దీన్ని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. శాస్త్రాలను, కాంటూర్స్‌ను అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అవన్నీ చూశాక ఒక పరిష్కార మార్గం కనుగొనాలని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top