గాంధీ వైద్యుల మధ్య ‘కరోనా’ లొల్లి!

Gandhi Hospital Coronavirus Nodal Centre Staff Conflict - Sakshi

నోడల్‌ సెంటర్‌ విషయంలో..అభిప్రాయభేదాలు

సౌకర్యాలు లేకుండా సెంటర్లు ఏమిటని ఓ వైద్యుడి నిలదీత

వైద్య ఆరోగ్యశాఖ సీరియస్‌..డీఎంహెచ్‌కి వైద్యుడి సరెండర్‌  

అతని ఆరోపణలు తప్పని పేర్కొన్నసూపరింటెండెంట్‌

గాంధీఆస్పత్రి : కరోనా నోడల్‌ కేంద్రం ఏర్పాటు, వైద్య చికిత్సల విషయంలో వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. పారిశుధ్య లోపానికి తోడు సరిపడు స్టాఫ్‌ నర్సులు కూడా లేని ఆస్పత్రిలో ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? అని అంతర్గత సమావేశంలో ఉన్నతాధికారులను నిలదీసిన ఓ వైద్యుడిపై ఆస్పత్రి పాలనా యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలనా వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు సున్నితమైన అంశాలపై బహిరంగ విమర్శలు చేస్తూ ఆస్పత్రి పరువు తీస్తున్నారని ఆరోపిస్తూ ఆస్పత్రి పాలనా యంత్రాంగం డీఎంఈ, డీహెచ్‌ సహా వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనను డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌కు సరెండర్‌ చేశారు. ఇదిలా ఉంటే ఆస్పత్రి పాలనా యంత్రాంగం పనితీరులోని లోపాలను ఎత్తి చూపినందుకే ఉన్నతాధికారులు కక్ష్యపూరితంగా తనపై ఏకపక్ష చర్యలకు పూనుకున్నారని గాంధీఆస్పత్రి క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ) డాక్టర్‌ వసంత్‌ కుమార్‌ ఆరోపించారు. అధికారుల అక్రమాలపై ప్రశ్నించినందుకే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తప్పుడు ఫిర్యాదులు నమోదు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

అసలేమైందంటే.. ?
కరోనా అనుమానితులకు అందించాల్సిన వైద్యసేవలు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ ఇటీవల ఆస్పత్రిలోని ఆయా విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌ఎంఓ–1 జయకృష్ణ, కరోనా నోడల్‌ అధికారి ప్రభాకరరెడ్డి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ మంగమ్మ, మినిస్టీరియల్‌ ప్రతినిధి యాదిలాల్, అసిస్టెంట్‌ మేనేజర్‌ శివరామ్‌ తదితరులతో సమావేశంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో సీఎంఓ వసంతకుమార్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయానికి వచ్చి ఆస్పత్రిలో పారిశుధ్య లోపం ఉంది. నర్సులు కూడా అందుబాటులో లేరు. మీరంతా ఏం చేస్తున్నారు.? అంటూ ఆర్‌ఎంఓ–1 జయకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముఖ్యమైన సమావేశంలో ఉన్నామని, మిగతా అంశాలపై ఆ తర్వాత చర్చించు కుందామని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని పాలనా యంత్రాంగం సూచించింది. అయితే ఆయన ఆ విషయాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.డాక్టర్‌ వసంతకుమార్‌ ప్రవర్తనా తీరును పాలనా యంత్రాంగం తప్పు పట్టింది. లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో సోమవారం ఆ యన్ను డీఎంహెచ్‌కు సరెండర్‌ చేశారు.  

సీసీ యాక్టు ప్రకారం చర్యలు తీసుకున్నాం
సీఎంఓగా విధులు నిర్వహించిన వసంత్‌కుమార్‌పై క్లాసిఫికేషన్‌ కంట్రోల్‌ అండ్‌ అపీల్‌( సీసీఏ) యాక్టు ప్రకారం చర్యలు తీసుకున్నాం. గాంధీలో కరోనా నోడల్‌ సెంటర్‌ ఏర్పాటుపై కేంద్ర నిఘా విభాగానికి డాక్టర్‌ వసంత్‌కుమార్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇకపై గాంధీ ఆస్పత్రితో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. సీఎంఓ వసంత్‌కుమార్‌ డబ్బులు ఇవ్వాలని తమను డిమాండ్‌ చేశారని గాంధీ మెడికల్‌ షాపుల యాజమానులు, క్యాంటీన్‌ నిర్వాహకులు, కాంట్రాక్టర్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. ఆయనపై గతంలో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చిలకలగూడ పోలీసులు సమాచారం అందించారని సూపరింటెండెంట్‌ తెలిపారు.–డాక్టర్‌ శ్రవణ్‌కుమార్,సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top