కొత్త సచివాలయానికి 27న శంకుస్థాపన! | Sakshi
Sakshi News home page

కొత్త సచివాలయానికి 27న శంకుస్థాపన!

Published Tue, Jun 11 2019 3:32 AM

Foundation Stone To New Secratariate In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది! విశ్వసనీయ వర్గాల సమా చారం ప్రకారం ఈ నెల 27న కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భూమి పూజ చేయనున్నారు. ఈ నెల 27 తర్వాత నుంచి మూడు నెలల వరకు సుముహూర్తాలేవీ లేకపోవడంతో 27వ తేదీనే ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. ప్రస్తుతం తెలంగాణ సచివాలయ కార్యాలయాలు కలిగిన ఏ, బీ, సీ, డీ బ్లాకుల భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులను ప్రారంభించడానికి వీలుగా ఏపీ ప్రభుత్వ అధీనంలోని సచివాలయ భవనాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ అధీనంలో ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాలతోపాటు ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను తమకు అప్పగించాలని ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర విభజన అనంతరం సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాకులను తెలంగాణకు, ఎల్, జే, హెచ్, కే బ్లాకులను ఏపీకి కేటాయించారు. ఏపీ అధీనంలోని బ్లాకుల అప్పగింత పూర్తయిన వెంటనే తెలంగాణ సచివాలయంలోని వివిధ శాఖల కార్యాలయాలను ఈ భవనాలకు తరలించి ఏ, బీ, సీ, డీ బ్లాకులను ఖాళీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఖాళీ చేసిన ఏ, బీ, సీ, డీ బ్లాకుల భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా ఏపీ భవనాల అప్పగింత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

సత్వరమే భవనాలు అప్పగించండి: సీఎస్‌ 
హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను సత్వరమే తమ రాష్ట్రానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి కోరారు. ప్రధానంగా సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను వీలైనంత త్వరగా అప్పగించాలని ఆయన పేర్కొన్నారు. ఏపీ అధీనంలో ఉన్న భవనాల అప్పగింత అంశంపై సోమవారం ఆయన సచివాలయంలో ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (ఎక్స్‌ అఫీషియో) ఎల్‌. ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావులతో సమావేశమై చర్చించారు. హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఈ నెల 2న ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే.

ఈ క్రమంలో భవనాల అప్పగింత ప్రక్రియ వేగిరం చేయాలని సీఎస్‌ ఎస్‌కే జోషి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా సమావేశానికి హాజరైన ప్రేమ్‌చంద్రారెడ్డిని కోరారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఏపీ అధీనంలో ఉన్న భవనాలను తమకు అప్పగిస్తే కొత్త భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకుంటామని సీఎస్‌ పేర్కొన్నట్లు తెలిసింది. ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణ సాధారణ పరిపాలన శాఖకు, ఏపీ అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి, ఎమ్మెల్యే క్వార్టర్లను ఎస్టేట్‌ ఆఫీసర్‌కు అప్పగించాలని సీఎస్‌ సూచించారు.

భవనాల అప్పగింత అంశాన్ని తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దృష్టికి తీసుకెళ్తామని, తమ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని ప్రేమ్‌చంద్రారెడ్డి తెలంగాణ సీఎస్‌కు తెలిపారు. సచివాలయంలోని జే బ్లాక్‌ భవన సముదాయం నుంచి ఫైళ్లు, ఇతర సామగ్రిని సోమవారం ఏపీ అధికారులు రెండు వాహనాల్లో నింపి తమ రాష్ట్రానికి తరలించారు. దీనిపై ‘సాక్షి’ప్రేమ్‌చంద్రారెడ్డిని సంప్రదించగా ఏపీకి కేటాయించిన భవనాలను ఖాళీ చేసి తెలంగాణకు అప్పగించాలని తనకు ఇప్పటివరకు ఎలాంటి సూచనలు అందలేదన్నారు. ఏపీ ప్రభుత్వశాఖలు తమ ఫైళ్లను స్వరాష్ట్రానికి తరలించుకోవడం కొత్త విషయం కాదన్నారు.

Advertisement
Advertisement