తగ్గుతున్న బర్త్‌రేట్‌..

Fertility Rate Decreased in Telangana According To 2017 Census Data - Sakshi

రాష్ట్రంలో 2016తో పోలిస్తే 2017లో తగ్గిన జననాలు..

మరణాల్లోనూ భారీగా తగ్గుదల

జనన, మరణాల రిజిస్ట్రేషన్లకు పెరుగుతున్న ఆదరణ

గడువులోగా ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నది 75% మంది

2017 జనాభా వివరాలను ప్రకటించిన జనగణన శాఖ

జననం లెక్క తప్పింది. జనాభా లెక్క తగ్గింది.  రాష్ట్రంలో ఇప్పుడు జననాల సంఖ్య తగ్గింది. 2017లో జననాలరేటు తగ్గుముఖం పట్టింది. 2016లో 6,24,581 జననాలు నమోదుకాగా, 2017లో 6,17,620 జననాలు ఉన్నట్లు సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం (సీఆర్‌ఎస్‌) 2017 జనగణన లెక్కలు చెబు తున్నాయి. జననాల్లో హైదరాబాద్‌దే అగ్రస్థానం. రాష్ట్రంలో మరణాల్లోనూ తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం రాష్ట్ర జనాభా 3.694 కోట్లు. జనాభా సగటున ఒక శాతం మాత్రమే పెరుగుతోంది.

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో జననాల వేగానికి బ్రేక్‌ పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి రాష్ట్రంలో ఏటా జననాల సంఖ్య పెరుగుతూ వస్తుండగా 2017లో మాత్రం ఈ జోరు కాస్త తగ్గింది. జనగణనశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. 2017 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం (సీఆర్‌ఎస్‌) 2017 గణాంకాలను విడుదల చేసింది. 2017లో దేశవ్యాప్తంగా 2.210 కోట్ల జననాలు నమోదవగా ఇందులో రాష్ట్రంలో 6.17 లక్షల జననాలు నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో జననాలను పరిశీలిస్తే 2.79 శాతం జననాలు రాష్ట్రంలో రికార్డయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో సంభవించిన మరణాల్లోనూ తగ్గుదల కనిపించింది. 2016లో రాష్ట్రంలో మరణాల నమోదు 2,04,917గా ఉండగా 2017లో 1,78,345గా నమోదైంది. అలాగే నవజాత శిశువుల మరణాల్లోనూ కాస్త తగ్గుదల నమోదైంది. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడంతో రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గాయని చెప్పొచ్చు.    

రాష్ట్ర జనాభా 3.69 కోట్లు
జనన, మరణాల అంచనాలను పరిశీలించిన జనగణనశాఖ.. ఏటా జనాభా గణాంకాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన జనాభా గణాంకాల ప్రకారం దేశ జనాభా 128.85 కోట్లుకాగా తెలంగాణ జనాభా 3.694 కోట్లుగా, ఆంధ్రప్రదేశ్‌ జనాభా 5.232 కోట్లుగా నమోదైంది. తెలంగాణలో లింగనిష్పత్తి 915గా ఉంది. 

నమోదులో పురోగతి... 
జనన, మరణాల నమోదు అంశంలో దేశవ్యాప్తంగా పురోగతి నమోదవుతోంది. గతంలో ఇంటి వద్ద ప్రసవాలతో జననాల నమోదులో స్పష్టత కరువయ్యేది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగడంతో ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు. దీంతో గణాంకాలు సైతం స్పష్టంగా తెలుస్తున్నాయి. మరణాల నమోదులోనూ ఇదే పురోగతి ఉంది. రాష్ట్రంలో జననాల నమోదు 91.7 శాతం ఉండగా, మరణాల నమోదు 73.2 శాతంగా ఉంది. పిల్లలకు ఆధార్‌ నమోదుకు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడంతో వాటి నమోదులో భారీ పెరుగుదల ఉంది. అదేవిధంగా మరణ ధ్రువీకరణ పత్రాలతో పలు పథకాలు అనుసంధానం కావడంతో వాటి నమోదు అనివార్యమైంది. 

హైదరాబాద్‌ టాప్‌..
జనన, మరణాల్లో హైదరాబాద్‌ జిల్లా అగ్రస్థానంలో ఉంది. అత్యాధునిక ఆస్పత్రులుండడంతో ఇక్కడ వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. 2017 సంవత్సరంలో హైదరాబాద్‌ జిల్లాలో 188457 జననాలు, 60730 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కేసీఆర్‌ కిట్‌ పథకానికి ఆస్పత్రి ప్రసవాలతో అనుసంధానం కావడంతో గ్రామీణ ప్రజలు సైతం పట్టణ ఆస్పత్రులకు తరలివస్తున్నారు. ఇక్కడే వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు ప్రసవాలకు సైతం పట్టణ ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇవ్వడంతో జననాల నమోదు పెరుగుతోంది. జననాల సంఖ్యలో నిజామాబాద్, వరంగల్‌ అర్భన్, సంగారెడ్డి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రాష్ట్రంలో జనన, మరణాల స్థితి ఇలా....

  • 2017లో రాష్ట్రవ్యాప్తంగా 6.17 లక్షల జననాలు నమోదవగా ఇందులో మగ శిశువులు 3.22 లక్షలు, ఆడ శిశువులు 2.95 లక్షలు ఉన్నారు. అదేవిధంగా ఆ ఏడాది 1.78 లక్షల మరణాలు సంభవించగా ఇందులో లక్ష (1.007 లక్షలు) మంది మగవారు, 77.6 వేల మంది ఆడవారున్నారు. 
  • జననాల నమోదులో 20వ స్థానంలో, మరణాల నమోదులో 17వ స్థానంలో తెలంగాణ ఉన్నట్లు జనగనణశాఖ గణాంకాలు చెబుతున్నాయి. నిర్ధిష్ట గడువులోగా 4,48,861 (72.7 శాతం) జననాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. 21 రోజుల నుంచి నెలలోగా నమోదైనవి 1,19,562, ఏడాదిలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు 31,815, ఏడాది తర్వాత రిజిస్టర్‌ అయినవి 17,380. 
  • రాష్ట్రంలో జననాల నమోదుతో పోలిస్తే మరణాల నమోదులో ముందున్నట్లు కనిపిస్తోంది. నిర్దిష్ట గడువులోగా మరణాల రిజిస్ట్రేషన్‌ 82 శాతం ఉంది. 1.78 లక్షల మరణాల్లో 1.46 లక్షల మరణాలకు సంబంధించి 21 రోజుల్లోగా రిజిస్ట్రేషన్‌ జరిగింది. అలాగే 21 రోజుల నుంచి నెలలోపు రిజిస్ట్రేషన్‌ అయిన మరణాలు 21,401, ఏడాదిలోపు నమోదైనవి 8,917, ఏడాది తర్వాత రిజిస్ట్రేషన్‌ అయినవి 1,783. మరణాల కేటగిరీలో రిజిస్ట్రేషన్ల పెరుగుదలను పరిశీలిస్తే మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందాలంటే మరణ ధ్రువీకరణ తప్పనిసరి కావడంతో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top