మేనిఫెస్టో అమలులో అధికార, ప్రతిపక్షాలు పూర్తిగా విఫల మయ్యాయని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు.
హన్మకొండసిటీ, న్యూస్‌లైన్ : మేనిఫెస్టో అమలులో అధికార, ప్రతిపక్షాలు పూర్తిగా విఫల మయ్యాయని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. హన్మకొండలోని ఎంఎస్‌పీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టో ను అమలు చేయడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలతో పాటు అన్నివర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగానే తాము మేనిఫెస్టోను రూపొందించామన్నారు.
2014 ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులు 30 అసెంబ్లీ స్థానాలు, ఐదు నుంచి ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పారు. తెలంగాణలో 15 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. మిగతా జాబితాను 6, 7 తేదీల్లో ప్రకటించనున్నట్లు చెప్పారు. ఎన్నికలను పురస్కరించుకుని వివిధ పార్టీలు మాటల యుద్ధం చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాయని తెలి పారు.
ఓట్లు, సీట్ల కోసం జెండాలు మోసిన కార్యకర్తలను వదలిపెట్టి అప్పటికప్పుడు వస్తు న్న నాయకులను చేరదీసి పార్టీలో టికెట్లు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఎంఎస్‌పీ నిజమైన కార్యకర్తలకే గుర్తింపునిస్తుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ రియాజ్, జిల్లా అధికార ప్రతినిధి తీగలప్రదీప్‌కుమార్‌గౌడ్, బండారి సురేందర్, రాజు, ప్రభాకర్, లింగం పాల్గొన్నారు.