నేడు, రేపే.. ప్రచార వేగం

The Election Campaign Is Going To Be Opened In The Next Two Days. - Sakshi

రేపటితో ప్రచార పర్వానికి తెర  

ముంచుకొస్తున్న ఎన్నికల గడువు 

వేగం పెంచిన రాజకీయ పార్టీలు  

గెలుపుపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ధీమా 

రేపు గజ్వేల్‌లో కేసీఆర్‌ బహిరంగ సభ 

చూస్తూ చూస్తూనే ఎన్నికల ప్రచార ఘట్టానికి మరో రెండు రోజుల్లో తెరపడబోతోంది. ఈనెల 5వ తేదీ సాయంత్రం వరకే ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఓటర్లను ఎంత అభ్యర్థించినా ఈ రెండు రోజుల్లోనే చేయాలి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. క్షణం కూడా వృథా చేయకుండా సుడి గాలి పర్యటనలు చేస్తున్నా రు. ఇప్పటికే ఒకసారి ప్రచారం పూర్తి చేసిన నాయకులు మరోసారి తిరిగిన ఇల్లు, తిరగని ఇల్లు అని లేకుండా ఓటర్లను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. షెడ్యూల్‌లో వెనుకబడిన కూటమి అభ్యర్థులు, ఇతర పార్టీలకు చెంది న వారితోపాటు ఇండిపెండెట్లు ఓటర్లను ఆకట్టుకునేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  

సాక్షి, సిద్దిపేట: ప్రచార కార్యక్రమం ముగింపునకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు వేగం పెంచారు. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్‌ నియోజకవర్గాలతోపాటు, జనగామ నియోజకవర్గంలో అంతర్భాగమైన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, మానకొండూరు నియోజకవర్గంలో భాగమైన బెజ్జంకి మండలాల్లో అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎన్నికలకు ముందు నుండే ప్రజాఆశీర్వాద సభల పేరిట నియోజకర్గంలోని అన్ని గ్రామాలను చుట్టివచ్చారు.

అదేవిధంగా కుల సంఘాలు, వృత్తి సంఘాలు ఇతర అన్ని వర్గాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి తాను చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించమని ఓటర్లను కోరారు. అయితే హరీశ్‌రావుకు తన నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు ఉండటంతో.. ఆయన అనుచరులు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతోపాటు, అన్ని వార్డు కౌన్సిలర్లు, ఇతర ముఖ్య కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారు.

ఈసారి హరీశ్‌రావుకు ఎలాగైన లక్ష మెజారిటీ సాధించేందుకు అహోరాత్రులు కష్టపడుతున్నారు. అభివృద్ధిని కనులకు కట్టినట్లు చూపించేందుకు ఎల్‌ఈడీలు, కరపతాప్రలతో వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి నరోత్తంరెడ్డి, కూటమి అభ్యర్థి భవాని రెడ్డి, బీఎల్‌ఎప్‌ అభ్యర్థి జగన్‌ లతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. 

గజ్వేల్‌లో బిజీ బిజీ ..
గజ్వేల్‌ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డిలతోపాటు రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు, మాజీ మంత్రి ముత్యం రెడ్డిలు ప్రచారం చేస్తున్నారు. కీలక నాయకులకు మండలాలు విభజించి బాధ్యతలు అప్పగించడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఎం ఫాం హౌజ్‌లో కార్యకర్తల సమావేశం పెట్టి ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా ఈనెల 5వ తేదీన గజ్వేల్‌లో బహిరంగ సభ ఏర్పాట్లలో బిజీగా మారారు.

అదేసమయంలో కూటమి అభ్యర్థి, కాంగ్రెస్‌ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి చాపకింది నీరులాగా సైలెంట్‌గా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వంటేరుకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పెద్ద నాయకులతో గజ్వేల్‌లో సభలు, సమావేశాలు నిర్వహిస్తారని ప్రచారం జరిగినా అవి ఎప్పటికప్పుడు వాయిదా పడుకుంటూ రావడం గమనార్హం. గతంలో సిరిసిల్ల నుంచి కేటీఆర్‌పై పోటీ చేసి ఓటమి చవిచూసిన బీజేపీ అభ్యర్థి ఆకుల విజయ ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీకి దిగారు. ప్రభావం చూపేందుకు తన వంతు కష్టపడుతున్నారు.  

దుబ్బాకలో జోష్‌.. 
దుబ్బాక నియోజకవర్గం విషయానికొస్తే తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఉదయం నుండి సాయంత్రం వరకు నియోజకవర్గ కీలక నాయకులతో కలిసి అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల బహిరంగ సభను సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రసంగించిన కేసీఆర్‌ కార్యకర్తల్లో జోష్‌ నింపారు. ఇంతటితో ఆగకుండా మంత్రి హరీశ్‌రావుతో దుబ్బాకలో రోడ్‌షో నిర్వహించి వేలాది సంఖ్యలో జనాన్ని సమీకరించారు. అప్పటి వరకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించి.. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాకలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభను పెట్టించి జోష్‌ నింపారు.

అదేవిధంగా ఓటర్లను కలుస్తూ వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలే తనను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. అయితే కూటమి అభ్యర్థిగా టికెట్‌ తెచ్చుకున్న టీజేఎస్‌ అభ్యర్థి చిందంరాజ్‌కుమార్‌ ప్రచారంలో వెనకబడి పోయారు. ఇప్పటి వరకు ఆయన ప్రచారం కోసం ఏ ఒక్క నాయకుడు కూడా రాకపోవడం విశేషం. అదేవిధంగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న నాగేశ్వర్‌రెడ్డి తన ట్రస్ట్‌ సభ్యులపై నమ్మకం పెట్టుకొని ప్రచారం చేయడం గమనార్హం. అదేవిధంగా బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి జగన్‌ అనుబంధ సంఘాల నాయకులను ప్రచారంలో దింపి ముందుకు వెళ్తున్నారు.  

హుస్నాబాద్‌లో పుంజుకున్న ప్రచార వేగం.. 
హుస్నాబాద్‌ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు స్తబ్ధతగా ఉన్నా.. గత మూడు, నాలుగు రోజుల నుంచి ప్రచారంలో వేగం పెంచారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఒడితల సతీష్‌కుమార్‌ ముందస్తుగా పక్కా ప్రణాళికతో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పర్యటించి చేసిన అభివృద్ధి చెయ్యబోయే పనులు వివరించి ఓట్లు అడిగారు. కూటమి నుండి పోటీలో దిగిన సీపీఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డి నిన్న మొన్నటి వరకు స్తబ్ధతగా ఉన్నా ఒక్కసారిగా దూకుడు పెంచారు.

ఆదివారం హుస్నాబాద్‌లో సభను నిర్వహించి ప్రచారంలో ఊపు తెచ్చారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి చాడ శ్రీనివాస్‌రెడ్డి జాతీయ నాయకులతో రోడ్‌షోలు నిర్వహించి తమ బలాన్ని కూడా నిరూపించుకున్నారు. అదేవిధంగా మిగిలిన రెండు రోజు సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ అధినాయకులతో రోడ్‌ షోలు నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నాయి.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top