బాబోయ్‌ బస్సు ప్రయాణం!

Dussehra rush in RTC - Sakshi

     ఆర్టీసీలో కొనసాగుతున్న దసరా రద్దీ 

     ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న బస్సులు 

     50 శాతం అదనపు చార్జీల వసూలు 

     కనీస సౌకర్యాలు కరువు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో దసరా సెలవుల రద్దీ కొనసాగుతోంది. ప్లాట్‌ఫారం మీదకి వచ్చిన ప్రతీ బస్సు క్షణాల్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. పండుగ రద్దీ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ‘దసరా స్పెషల్‌’పేరిట ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్‌ నుంచి 4,480 ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు నడుస్తున్నాయి. ఈ నెల 13 నుంచి 21 వరకు ఈ సర్వీసులు తిరుగుతాయి. ప్రతీ బస్‌ టికెట్‌పై ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. కార్యాలయాలు, కళాశాలలు, ఇతర కోచింగ్‌ సెంటర్లకు సెలవులు ప్రకటించిన దరిమిలా.. ఈ రద్దీ ఆదివారం నుంచి మరింత పెరిగింది. బస్సు దొరికితే చాలు, కనీసం నిలబడి అయినా సరే వెళదామనుకునే వారి సంఖ్య అధికంగా ఉంది.  

కానరాని సదుపాయాలు.. 
రద్దీ నేపథ్యంలో ఎంజీబీఎస్, ఉప్పల్, కాచిగూడ, జేబీఎస్‌ల నుంచి ఆర్టీసీ దసరా స్పెషల్‌ బస్సులను నడుపుతోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సులు ఉన్నాయి. వీటిలో చాలా బస్సుల్లో సరైన సదుపాయాల్లేవు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కిటికీలు సరిగ్గా లేక రాత్రిపూట ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సూపర్‌ లగ్జరీ బస్సుల్లో టీవీలు లేక ఖాళీ అరలు దర్శనమిస్తున్నాయి. అయినా టికెట్‌ ధరలో ఎలాంటి మార్పులు ఉండకపోవడం గమనార్హం. ఇక రాజధాని, గరుడ బస్సుల్లో దుప్పట్లు, వాటర్‌ బాటిళ్లు అందజేయాలి. కానీ కొన్ని బస్సుల్లో వాటిని ఇవ్వడం లేదని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో ఎక్కువగా ఆన్‌లైన్‌ ద్వారానే బుకింగ్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో ప్రతి టికెట్‌పై అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అయినా, వీరికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పలుచోట్ల డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. 

సమస్య పరిష్కారమైంది: మునిశేఖర్‌ సీటీవో, టీఎస్‌ఆర్టీసీ
కరీంనగర్, వరంగల్‌తోపాటు కొన్ని జిల్లాలకు వెళ్లే బస్సుల్లో దుప్పట్లు, వాటర్‌ బాటిళ్లు అందించడం లేదన్న ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయం వాస్తవమే. వీటిని సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులో జరిగిన జాప్యమే దీనికి కారణం. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ప్రయాణికులు బస్సుల్లో కిక్కిరిసిపోతున్నా.. ఆ బస్సులన్నీ తిరిగి వచ్చేటప్పడు ఖాళీగానే వస్తున్నాయి. అందుకే తాము ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top