‘డబుల్‌’ కల తీరుతోంది!

Double Bedroom Scheme In Telangana Government - Sakshi

జెడ్పీ సెంటర్‌(మహబూబ్‌నగర్‌): గూడు లేని నిరుపేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది. రాష్ట్రప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు డబుల్‌ బెడ్‌రూం గృహాలు నిర్మిస్తుండగా.. నిరుపేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధహయ్యాయి. మహబూబ్‌నగర్‌ పట్టణానికి 2,300 ఇళ్లను సీఎం కేసీఆర్‌ మంజూరు చేయగా.. ఇప్పటికే క్రిస్టియన్‌పల్లిలో 310 ఇళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక మండల పరిదిలోని దివిటిపల్లిలో మరో 1,334 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇందులో 882 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా బుధవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం హౌజింగ్‌ పీడీ రమణారావు గృహాలను పరిశీలించారు. దీంతో మరో పక్క వీరన్నపేటలో 660 ఇళ్ల నిర్మాణ పనులు  కొనసాగుతున్నాయి.
 
ప్రతిష్టాత్మకం 
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకాన్ని ప్రకటించారు. అంతేకాకుండా పథం తీరుతెన్నులపై స్వయంగా ఆయనే పరిశీలిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. రూ.5 లక్షలకు పైగా వ్యయంతో ప్రభుత్వమే ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు ఇస్తుండడంతో నిరుపేదలు కొండంత ఆశ పెట్టుకున్నారు. ఈ మేరకు దివిటిపల్లిలో 882 గృహాలను బుధవారం మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

1,334 ఇళ్ల నిర్మాణం 
మండల పరిధిలోని దివిటిపల్లిలో 1,334 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా 882 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొత్తంగా 52 ఎకరాల్లో ఇళ్లను నిర్మిస్తుండగా.. తొలుత మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఇళ్లను ప్రారంభించి ఆ తర్వాత లబ్ధిదారులను కేటాయించాలని నిర్ణయించారు. సీఎం జిల్లా కేంద్రానికి మంజూరు చేసిన 2,300 ఇళ్ల కోటాలో వీటి నిర్మాణ పనులు సాగుతున్నాయి. వీరన్నపేట, పాతపాలమూర్, పాత తోటకు చెందిన వారి కోసం ఈ ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. క్రిస్టియన్‌పల్లిలోని ఆదర్శనగర్‌ 523 సర్వే నెంబర్‌లో 15 ఎకరాల్లో డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు సాగుతోంది. ఇందులో 310 ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు కూడా అందజేశారు. ఇక 2,300 ఇళ్లలో పాత తోట వాసులకు 234, పాత పాలమూర్‌ వాసులకు 530 ఇళ్లు, వీరన్నపేట వారి కోసం 1,536 ఇళ్లు కేటాయించారు. 

ఏర్పాట్లు పూర్తయ్యాయి
జిల్లా కేంద్రంలోని దివిటిపల్లిలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. ఇందులో 882 ఇళ్లను మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించనుండగా ఏర్పాట్లు పూర్తిచేశాం. మంత్రి ప్రారంభించిన అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తాం.  – రమణరావు, హౌజింగ్‌ పీడీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top