2018 అచ్చిరాలేదు

Disappointing year journey of RTC  - Sakshi

అప్పులు..ప్రమాదాలు

నిరాశాజనకంగా ఆర్టీసీ ఏడాది ప్రయాణం

ఓ వైపు పెరిగే అప్పులు..మరోవైపు ప్రమాదాలు

ఇటు ఇబ్బంది పెట్టిన కార్మికుల సమ్మె నిర్ణయాలు

స్పెషల్‌ సీజన్లలో వచ్చే ఆదాయంతో కొంత ఊరట  

రాష్ట్ర ఆర్టీసీకి ఈ ఏడాది చాలా చేదు జ్ఞాపకాలే మిగిలాయి. పెరుగుతున్న అప్పులు,వాటి వడ్డీలు, నిర్వహణ వ్యయం, డీజిల్‌ ధరలతో ఓ వైపు సతమతమవుతుంటే.. మరోవైపు ఫిట్‌నెస్‌ లేని బస్సుల కారణంగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు మరింత కలవరపెట్టాయి. ఇటు ప్రభుత్వం నుంచి ఆశించినంత సహకారం అందకపోవడం సంస్థకు శాపంగా మారింది. ఆర్టీసీకి కేటాయించిన బడ్జెట్‌లో ఇంతవరకు పూర్తిస్థాయిలో ఎప్పుడూ నిధులు విడుదల కాలేదు. కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బందిపై పని ఒత్తిడి ఆర్టీసీలో సత్వరమే పరిష్కరించాల్సిన సమస్యలుగా ఉన్నాయి. అయితే స్పెషల్‌ సీజన్లలో ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనతో ఆదాయం పెరుగుతుండటం కొంత ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు.

మొదటి 6 నెలల పరిణామాలు
ఈ ఏడాది మొదటి నుంచి ఆరు నెలల పాటు ఆర్టీసీ అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కార్మికుల సమ్మె నిర్ణయం, రెండు ప్రమాద ఘటనలు పెద్దవిగా చెప్పవచ్చు. జనవరిలో హైదరాబాద్‌లో టికెట్‌ రేట్లను ఆర్టీసీ స్వల్పంగా సవరించింది. చిల్లర ధర తలెత్తుతుండటంతో ఈ మేరకు కొన్ని టికెట్ల ధరలో పెంపు, మరికొన్నింటికి కోత విధించింది. ఫిబ్రవరిలో సంస్థ ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకతలో స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్‌ ఆర్టీసీకి ఉత్తమ రవాణా సంస్థగా అవార్డు దక్కింది. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.975 కోట్లు కేటాయించింది కానీ, రూ.230 (సెప్టెంబర్‌ వరకు) మాత్రమే విడుదల చేశారు. ఏప్రిల్‌లో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.140 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది.

మేలో వేతన సవరణ జరపాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. స్పందన లేకపోయే సరికి 11వ తేదీన సమ్మెలోకి వెళ్తున్నట్లు గుర్తింపు పొందిన సంఘం టీఎంయూ, ఇతర సంఘాలు ప్రకటించాయి. కానీ, ఆ నెలలో సమ్మెజరగలేదు. ఇటు రిమ్మనగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం 13 మంది మరణించారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. జూన్‌లో మరోసారి కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. దీనిపై ప్రభుత్వం  మండిపడింది. అవసరమైతే ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారన్న ప్రచారం జరిగింది. మంత్రుల కమిటీతో యూనియన్ల చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు. 16 శాతం మధ్యంతర భృతి చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఇదే నెలలో సంస్థ ఎండీ రమణారావు పదవీకాలం పూర్తవడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఇన్‌చార్జి ఎండీగా ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సునీల్‌ శర్మ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్‌లో కొండగట్టు ప్రమాదం..
జూలైలో ఆదాయం పెంచుకునేందుకు, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఎక్స్‌పర్ట్‌ కమిటీ నియమించారు. తర్వాతి నెలలో పెద్దగా పరిణామాలు జరగలేదు. అయితే సెప్టెంబరు 11న ఆర్టీసీ చరిత్రలోనే ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు లోయలో పడి ఏకంగా 62 మంది దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ చరిత్రలోనే ఈ స్థాయి ప్రమాదం ఎప్పుడూ చోటుచేసుకోలేదు. అదే నెల దసరా సెలవులప్పుడు నడిపిన బస్సుల ద్వారా దాదాపు రూ.18 కోట్లు ఆర్జించినట్లు సమాచారం. నవంబర్‌లో ఆర్టీసీ నష్టాలు రూ.270 కోట్లు (సెప్టెంబర్‌) వరకు దాటినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీకి కొత్తగా రూ.500 కోట్ల అప్పు దొరికింది. ప్రభుత్వ పూచీకత్తుతో బ్యాంకులు ఈ మొత్తాన్ని సంస్థకు ఇచ్చాయి. డిసెంబర్‌లో సీసీఎస్‌ నుంచి వాడుకున్న నిధుల్లో రూ.80 కోట్లు తిరిగి ఆర్టీసీ చెల్లించింది.
– సాక్షి, హైదరాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top