ఎమ్మెల్యే వియ్యంకుడి అడ్డగింత

Dasari Manohar Reddy Relative Ramreddy Hulchul In Peddapalli - Sakshi

సాక్షి, పెద్దపల్లి రూరల్‌: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి వియ్యంకుడు చిట్టిరెడ్డి రాంరెడ్డిని మంగళవారం పెద్దపల్లిలో అడ్డుకున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు వచ్చాడని ఆరోపిస్తూ.. స్థానిక యువకులు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే వియ్యంకుడికి అక్కడి నుంచి తప్పించారు. బయటివారు స్థానికంగా ఉండకూడదని ఉత్తర్వులున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ గడువు దగ్గర పడుతున్న కొద్ది అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య సోషల్‌ మీడియా వేదికగా సమరం సాగుతోంది. పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలోని వార్డుల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారంటూ పెద్దపల్లి పట్టణంలోని బండారికుంటకు చెందిన పలువురు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వియ్యంకుడు చిట్టిరెడ్డి రాంరెడ్డిని, కట్కూరి సుధాకర్‌రెడ్డిలను మంగళవారం అడ్డుకున్నారు. బండారికుంటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా డబ్బులను పంచేందుకే వచ్చారంటూ కాలనీకి చెందిన పలువురు యువకులు రాంరెడ్డిని అడ్డుకుని మీరు ఏ వార్డుకు చెందినవారు.. ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారో.. చెప్పాలంటూ ప్రశ్నిస్తూ తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

సుల్తానాబాద్‌లో పోలీసులతో విజయరమణారావు వాగ్వాదం

బుధవారం ఉదయం పోలింగ్‌ జరగనుండడంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకే వచ్చారంటూ ఆరోపించిన యువకులు సెల్‌ఫోన్లలో వీడియో చిత్రీకరించే యత్నం చేయగా రాంరెడ్డి తన అనుకూలురైన వ్యక్తి బైక్‌పై వెళ్లేందుకు యత్నించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి ఎమ్మెల్యే వియ్యంకుడిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయమై ఎస్‌ఐ ఉపేందర్‌ మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

కాంగ్రెస్‌ నాయకులకు బెదిరింపులా..?
సుల్తానాబాద్‌ (పెద్దపల్లి): సుల్తానాబాద్‌ కాంగ్రెస్‌ నేత అంతటి పుష్పలత అన్నయ్యగౌడ్‌ ఇంటి గోడ దూకి పోలీసులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి భయబ్రాంతులకు గురి చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. కొద్దిసేపు కాంగ్రెస్‌ నాయకులు, పోలీసులకు వాగ్వాదం జరగగా, అనంతరం సోదాలు నిర్వహించారు. 15వ వార్డుకు చెందిన ఓ అభ్యర్థి 45 చీరలు ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండగా.. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. 11వ వార్డు ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒకరు మద్యం బాటిళ్లు 48 తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై రాజేష్‌ తెలిపారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top