సారూ.. ఆమె మా బిడ్డనే..

Couple Request jubilee hills Police on Daughter Missing Case - Sakshi

కుమార్తె కోసం దంపతుల వేడుకోలు

బంజారాహిల్స్‌: తమ కూతురును అప్పగించాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు. బాధితుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన కస్తూరి పవన్, పార్వతి దంపతులు సికింద్రాబాద్‌ ఆనంద్‌ థియేటర్‌ వద్ద వాచ్‌మెన్‌లుగా పని చేస్తున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కూతురు శాంత ఉంది. గుల్బర్గాలోని హాస్టల్‌లో ఉంటూ నాలుగో తరగతి చదువుతోంది. ఈ నెల 18న కర్నూలులో జరగనున్న తమ కులదైవం జాతరకు వెళ్లేందుకని కూతురిని గత నెల 29న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. చుట్టుపక్కల వాళ్లతో ఆడుకుంటూ శాంత ఈ నెల 7న జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు వచ్చింది. తిరుగు ప్రయాణానికి అడ్రస్‌ దొరక్క భాష రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చౌరస్తాలో ఏడుస్తూ కూర్చున్న శాంతను అధికారులు గుర్తించి యూసుఫ్‌గూడ చైల్డ్‌లైన్‌కు తరలించారు. ఆ రోజు రాత్రి అంతటా గాలిస్తూ తల్లిదండ్రులు ఆరా తీసుకుంటూ జూబ్లీహిల్స్‌కు రాగా ఏడుస్తున్న చిన్నారిని కొంత మంది తీసుకెళ్లారని సమాచారం ఇచ్చారు.

దీంతో వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అప్పటికే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ఆ బాలికను శిశువిహార్‌కు తీసుకెళ్తున్నట్లుగా పోలీసులకు లేఖ ఇచ్చి వెళ్లారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే శిశువిహార్‌కు వెళ్లి తమ కూతురిని అప్పగించాలన్నారు. ఆమె మీ కూతురే అనడానికి సాక్ష్యాలు ఇవ్వాలంటూ అధికారులు చెప్పారు. దీంతో గ్రామానికి వెళ్లి ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డు తీసుకొచ్చారు. అధికారులు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. కమిటీ ముందు పెడతామని తొమ్మిది రోజులుగా తిప్పుతున్నారు. రోజూ వెళ్లి కూతురిని చూడటం, అధికారులను బతిమిలాడటం పోలీసుల చుట్టూ తిరగడానికే సరిపోతోందని.. బాలిక శాంత తమ కూతురేనని చెప్పడానికి పడుతున్న తంటాలు వర్ణనాతీతంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మీరైనా లేఖ ఇవ్వండి అంటూ తాజాగా మంగళవారం జూబ్లీహిల్స్‌ పోలీసులను వేడుకున్నారు. అందుకు చట్టం ఒప్పుకోదని పోలీసులు అంటున్నారు. కమిటీ నిర్ణయం ప్రకారమే పాపను అప్పగిస్తామని అధికారులు అంటున్నారు. హోంలో కూతురు ఉండగా తల్లిదండ్రులు బయట రోడ్డుపైనే ఉండాల్సివస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top