16 నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు

Cotton purchase centers from 16th - Sakshi

     మార్కెటింగ్‌ కార్యకలాపాలపై సమీక్షలో మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం మంత్రి మార్కెటింగ్‌ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఎండీ చొక్కలింగంతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. పత్తి కొనుగోలు కేంద్రాలను తెరవడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని వెంటనే రంగంలోకి దిగాలని మంత్రి కోరారు. ఈ నెల 16 నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు చొక్కలింగం మంత్రికి చెప్పారు.

తేమ 8 శాతం కన్నా తక్కువ ఉండేట్లు చూసుకోవాలని పత్తి రైతులను కోరారు. బాదేపల్లి, గజ్వేల్, ఘన్‌పూర్, జమ్మికుంట, కరీంనగర్, పెద్దపల్లి, పరకాల, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,320 కన్నా తక్కువకు రైతులెవరూ అమ్ముకోవద్దని సూచించారు.

ఇతర పంటలపైనా సమీక్ష..
రాష్ట్రం అంతటా 231 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ ఎండీ జగన్మోహన్‌తో మాట్లాడారు. ఇప్పటివరకు 88 వేల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేశారని, అవసరాన్ని బట్టి మరిన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మార్క్‌ఫెడ్‌ను మంత్రి ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా మినుముల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సోయాబీన్‌ రైతుల కోసం 20 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. రైతులకు మద్దతు ధర కన్నా తక్కువ రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయిల్‌ఫెడ్, హాకా, మార్క్‌ఫెడ్‌ సంస్థలను మంత్రి కోరారు. 

‘సీతారామ’ వేగం పెంచండి
6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల వేగం పెంచాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుందని.. 3,28,853 ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం లభిస్తుందన్నారు. భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్య ప్రాణి అనుమతులు, పంప్‌ హౌజ్‌లు, కెనాల్స్, ఇతర పనుల పురోగతిపై జలసౌధలో మంత్రి సమీక్ష నిర్వహించారు. 4,000 ఎకరాల అటవీ భూముల సేకరణకు సంబంధించిన అనుమతులకు వారం రోజుల్లో కేంద్ర అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపించాలని, ఎకో సెన్సిటివ్‌ జోన్‌లోని 1,000 ఎకరాల అనుమతి కోసం పది రోజుల్లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అటవీ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకొని అటవీ భూముల సేకరణ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top