అద్దెకోసం అడ్డదారులు

Corrupt Officials In Gurukula Hostel  - Sakshi

పక్క జిల్లాలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలు, కాలేజీ

హద్దులు దాటుతున్న పర్యవేక్షకులు

పర్సెంటేజీలకు ఆశపడి ఇతర ప్రాంతాలకు తరలింపు

జిల్లాలో చెల్లించింది నెలకు రూ.98 వేల కిరాయి

రంగారెడ్డి జిల్లాలో చెల్లిస్తోంది రూ.10 లక్షలు

గురుకుల పాఠశాలలు కొనసాగుతున్న ప్రైవేటు భవనాలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తోంది. దీంతో పక్క జిల్లాలో ఇప్పటికే మూతబడిన ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల దృష్టి వీటి వైపు మళ్లింది. స్కూల్‌ పర్యవేక్షణ అధికారులకు పర్సెంటేజీలు ఇచ్చి.. జిల్లాలో కొనసాగుతున్న పాఠశాలలను మూతబడిన తమ కళాశాల భవనాలకు తరలించేలా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.

ఫలితంగా గత మూడేళ్లుగా జిల్లాలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల్లో నీళ్లు లేవని, ఇరుగ్గా ఉన్నాయని సాకులు చూపుతున్న అధికారులు.. చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయకుండా జిల్లా దాటిస్తున్నారు.

పరిగి : గురుకులాలకు గూడు కష్టాలు మొదలయ్యాయి. ఆర్భాటంగా ఆశ్రమ పాఠశాలలను మంజూరు చేస్తున్న ప్రభుత్వం వీటికి సొంత భవనాలు నిర్మించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు మంజూరైన గురుకులాల నిర్వహణను గాలికి వదిలేయడంతో.. పక్క జిల్లాకు తరలిపోతున్నాయి.

చిన్నచిన్న విషయాల్లో రాజకీయాలు చేసే జిల్లా ఎమ్మెల్యేలకు వీటి గోడు పట్టడంలేదు. ఈ స్కూళ్లకు కనీసం స్థానికంగా అద్దె భవనాలు కూడా సమకూర్చలేకపోతున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ఇంజినీరింగ్‌ కళాశాలల ఓనర్లు.. అద్దె ఆశతో ఒక్కో ఆశ్రమ పాఠశాలను పక్క జిల్లాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన మూడు గురుకులాలు రంగారెడ్డికి పయనమయ్యాయి. 

జిల్లాలో 24 గురుకులాలు..

గతంలో నియోజకవర్గానికి రెండు చొప్పున గురుకుల పాఠశాలలు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరాక ఒక్కో నియోజకవర్గానికి నాలుగు గురుకులాలు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో వీటి సంఖ్య 24కు చేరింది. జిల్లా వ్యాప్తంగా గతంలో ఉన్న ఎనిమిది స్కూళ్లకు సొంత భవనాలు ఉండగా.. కొత్తగా మంజూరైన వాటిని అద్దె భవనాల్లో ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ స్కూళ్లు కొనసాగుతున్నా ఇప్పటికీ సొంత గూళ్లకు నోచుకోలేదు. పరిగిలో మొదట రెండు గురుకులాలు ఉండేవి. వీటికి సొంత భవనాలు ఉన్నాయి. అయితే కొత్తగా మంజూరైన మూడు స్కూళ్లకు సంబంధించి ఒక్క ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులానికి మాత్రమే సొంత భవనం మంజూరు చేశారు. దీని నిర్మాణ పనులు సైతం నత్తనడకన కొనసాగుతున్నాయి. మిగతా వాటికి ఇంకా భవనాలే మంజూరు కాలేదు. 

నెలకు 6.లక్షల అద్దె.. 

మూడేళ్ల క్రితం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా జిల్లాకు మహిళా డిగ్రీ కళాశాల మంజూరైంది. భవనం నిర్మించే వరకు వికారాబాద్‌లోని కొత్తగడిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం కాలేజీని రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం సమీపంలో ప్రారంభించారు. అప్పటికే ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో గురుకుల పాఠశాల కొనసాగుతోంది.

అయితే తమకే స్థలం సరిపోవడం లేదని చెప్పటంతో మొయినాబాద్‌కు మార్చారు. అక్కడ ఓ ఏడాది కొనసాగిన తర్వాత మళ్లీ చేవెళ్ల సమీపంలోని తోల్‌కట్ట దగ్గర్లో ఉన్న ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ భవనంలోకి మార్చారు. దీనికి ప్రస్తుతం నెలకు రూ.6 లక్షలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు.  

ఊరెళ్ల భవనానికి రూ.10 లక్షలు  

రెండేళ్ల క్రితం పరిగిలో పరిగితో పాటు బురాన్‌పూర్‌కు సంబంధించిన రెండు బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. వీటిలో ఒక్కోదానికి నెలకు రూ.98 వేల అద్దె చెల్లించే వారు. అయితే ఏడాదికి పైగా కొనసాగిన తర్వాత కొత్తగా సమస్యలు పుట్టుకొచ్చాయి. ఈ సాకుతో బురాన్‌పూర్‌ బీసీ గురుకులాన్ని చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ల ఇంజినీరింగ్‌ కళాశాలలోకి మార్చారు. దీంతో పాటు పరిగి గురుకులానికి చెందిన మూడు తరగతులను కూడా పక్క జిల్లాకు మార్చారు.

ఒకే గురుకులాన్ని ఒక చోట సగం.. పక్క జిల్లాలో సగం తరగతులు నిర్వహిస్తున్న అధికారుల ధోరణిపై తల్లిదండ్రులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇక్కడ నెల అద్దెరూ.98 వేలు చెల్లిస్తూ రాగా.. పక్కజిల్లాలోని భవనానికి మాత్రం నెలకు రూ.10 లక్షల అద్దె చెల్లిస్తున్నారు. ఇలా రెండేళ్ల పాటు చెల్లించే అద్దెతో ఏకంగా గురుకుల భవన నిర్మాణమే పూర్తి చేయవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

వికారాబాద్‌ వచ్చేందుకు సిద్ధం.. 

గురుకుల పాఠశాలలు, కళాశాలలు వికారాబాద్‌ జిల్లా నుంచి పక్క జిల్లాకు తరలిపోవడంపై ఓ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. తాము వికారాబాద్‌ జిల్లాకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఇదే విషయాన్ని పలుమార్లు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారుల దృష్టికి కూడా తీసుకు వెళ్లామని తెలిపారు. 

వికారాబాద్‌ జిల్లాలో భవనం చూయిస్తే అందులోకి షిఫ్ట్‌ అవుతామని చెప్పారు. వికారాబాద్‌ జిల్లాకు చెందిన స్కూళ్లు, కాలేజీ కావడంతో ఏ సమస్య ఎదురైనా రంగారెడ్డి జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న భవనాలు ఏ పట్టణానికి దగ్గరగా లేకపోవటంతో విద్యార్థులు అనారోగ్యానికి గురైతే రాత్రి వేళల్లో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోందన్నారు.

 అధికారుల అత్యుత్సాహం 

జిల్లాలోని గురుకులాలను పక్క జిల్లాలకు మార్చేందుకు అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. గురుకులాలు మంజూరవగానే దగ్గరుండి  నాలుగు భవనాలు చూపించా. కొడంగల్‌లో స్థలం దొరకడంలేదంటే దానికి కూడా పరిగిలో భవనం చూపించా. ఏదో కారణం చెప్పి దాన్ని మరోచోటకు మార్చారు.  ఇంకో గురుకులానికి చెందిన మూడు తరగతులను పక్క జిల్లాకు తరలించారు. ఇక్కడికి తెస్తామంటే తోల్‌కట్ట వద్ద కొనసాగుతున్న కాలేజీకి కూడా పరిగిలో భవనం సమకూరుస్తాం.  

 – టి.రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top