కరోనా.. ఎలా సోకిందబ్బా?

Coronavirus Positive Cases Increasing In Hyderabad - Sakshi

గ్రేటర్‌లో తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా 

రోజుకు సగటున 30 నుంచి 40 కేసుల నమోదు 

శనివారం 33 పాజిటివ్‌ కేసులు

ఆదివారం కిటకిటలాడే చికెన్, మటన్, ఇతర మార్కెట్లు

భౌతిక దూరం విషయంలో సర్వత్రా నిర్లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగిస్తే.. ప్రజా జీవనం స్తంభించి పేద, మధ్య తరగతి ప్రజలు తమ జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని భావించి ప్రభుత్వం ఆంక్షల్ని సడలించింది. నగరంలోని చాలా మంది ఆంక్షల సడలింపు అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ పూర్తిగా తగ్గినట్లుగా భావిస్తున్నారు. అవసరం లేక పోయినా రోడ్లపైకి వస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు.. నిత్యావసరాలు, కూరగాయలు, చికెన్, మటన్‌ కొనుగోలు పేరుతో ఆయా మార్కెట్లకు పోటెత్తుతున్నారు. (ఆగస్టులోగా అంతర్జాతీయ విమానాలు!)

బర్త్‌డేల పేరుతో పార్టీలు ఏర్పాటు చేసి ఎంజాయ్‌ చేస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు అదుపులో ఉన్న వైరస్‌.. తాజాగా మరింత విజృంభిస్తున్నది. మర్కజ్, ఎన్నారై మూలాలు లేని కుటుంబాల్లో వైరస్‌ తీవ్ర రూపం దాల్చుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాల్లో కొత్తగా నమోదవుతున్న ఈ కేసుల మూలాలు అధికారులకు సైతం అంతు చిక్కడం లేదు. (వచ్చే10 రోజుల్లో 2,600 శ్రామిక్‌ రైళ్లు)

వైద్యుల సూచనలు బేఖాతార్‌... 
మర్కజ్‌ మూలాలు అధికంగా ఉన్న పాతబస్తీలో వైరస్‌ దాదాపు నియంత్రణలోకి వచ్చింది. గడచిన పదిహేను రోజులుగా ఇక్కడ కేసులు కూడా పెద్దగా నమోదు కావడం లేదు. ప్రస్తుతం ఏ మూలాలు లేని శివారు ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న ఈ కేసులకు ఆయా ప్రాంతాల్లోని వైన్‌షాపులు, కిరాణా షాపులు, నిత్యావసరాలు, కూరగాయల మార్కెట్లే కేంద్ర బిందువని అధికారులు చెబుతున్నారు. మార్కెట్లోకి వచ్చే ముందు మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కొనుగోలు చేసిన కాయకూరలు, ఇతర వస్తువులను రెండు మూడు గంటల వరకు ఇంట్లో ఎవరూ ముట్టుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కానీ నగరవాసులు ఈ సూచనలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా వైరస్‌ బారిన పడుతున్నారు.   

తాజాగా మరికొన్ని కేసులు నమోదు... 
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం వరకు 1761 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌వాసులే 1188 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 48 మంది మృతి చెందగా.. వీరిలో 42 మంది సిటీజనులే. ప్రస్తుతం గ్రేటర్‌లో రోజుకు సగటున 30 నుంచి 40 పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 670 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 70 మందికిపైగా పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా శనివారం కింగ్‌ కోఠి ఆస్పత్రి ఓపీకి 87 మంది రాగా, వీరిలో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న 16 మందిని ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్‌ చేశారు.

వీరితో పాటు ఐసొలేషన్‌ వార్డులో ఉన్న మరో ఇద్దరు.. మొత్తం 18 మంది నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 49 మంది ఉన్నారు. ఇక ఫీవర్‌ ఆస్పత్రిలో 24 మంది అనుమానితులు ఉన్నారు. ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రికి 21 మంది రాగా, వీరిలో 19 మందిని ఇన్‌పేషంట్లుగా అడ్మిట్‌ చేశారు. ముగ్గరికి పాజిటివ్‌ రాగా, వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆయుర్వేద ఆస్పత్రికి పది మంది రాగా, వారి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.

సనత్‌నగర్‌ డివిజన్‌లో ఒకరికి... 
సనత్‌నగర్‌: డివిజన్‌ పరిధిలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఇటీవల సుభాష్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలికి పాజిటివ్‌ రాగా, తాజాగా అశోక్‌కాలనీలో ఉండే ఓ యువకుడికి కరోనా సోకింది. అతనికి ఎలా సోకిందనే దానిపై స్పష్టత రావడం లేదు. దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా అని తేలింది. దీంతో అతని కుటుంబ సభ్యులందరినీ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బోరబండలో యువకుడికి.. 
వెంగళరావునగర్‌: బోరబండ డివిజన్‌ బంజారానగర్‌లో 27 ఏళ్ల ఓ యువకుడి (వ్యాపారి)కి కరోనా వచ్చింది. కొన్ని రోజులుగా అస్వస్థతగా ఉండటంతో అనుమానం వచ్చి ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. పరీక్షల అనంతరం అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఐసోలేషన్‌తో ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు మరో ఏడుగురిని క్వారంటైన్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. 

సర్కిల్‌–7 పరిధిలో నాలుగు పాజిటివ్‌ కేసులు 
యాకుత్‌పురా: జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ సర్కిల్‌–7 పరిధిలో శనివారం నాలుగు కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. వివరాలివీ... సర్కిల్‌ పరిధిలోని సంతోష్‌నగర్‌ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో ఒకటి, ఈదిబజార్‌ మౌలానా ఆజాద్‌నగర్‌లో రెండు, యాకుత్‌పురా వాహేద్‌ కాలనీ ఒక పాజిటివ్‌ కేసు నమోదైందన్నారు. పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో హోమ్‌ కంటైన్‌మెంట్లుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

అంబర్‌పేటలో ముగ్గురికి... 
అంబర్‌పేట: అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ పరిధిలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. శనివారం కాచిగూడలోని కామ్గార్‌నగర్, సుందర్‌నగర్, గోల్నాకలో నివసించే వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. వీరు ఇటీవల జియాగూడకు వెళ్లిరావడంతో కరోనా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి కుటుంబ సభ్యులను సైతం కరోనా నిర్ధారణ పరీక్షలకు తరలించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. 
సైదాబాద్‌ రెడ్డిబస్తీలో తల్లీకొడుకులకు... 
మలక్‌పేట: సైదాబాద్‌ డివిజన్‌ రెడ్డిబస్తీకి చెందిన తల్లీకొడుకులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. తల్లి మాదన్నపేటలో ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది. ఆ ఇంటి యజమానికి కరోనా రాగా.. ఇంట్లో పనిచేసే ఆమెకు కూడా టెస్ట్‌ చేయగా ఆమెకు, భర్తకు పాజిటివ్‌ వచ్చింది. రెడ్డిబస్తీలో నివాసం ఉండే ఆమె కూతురు పలుమార్లు మాదన్నపేటకు వెళ్లివచ్చింది. ఈ క్రమంలో ఆమె(30)కు, ఆమె కుమారునికి(07) పరీక్షలు చేయగా కోవిడ్‌ సోకినట్లు శుక్రవారం నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top