4 మరణాలు.. 41 కేసులు | Coronavirus: 41 Fresh Positive Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

4 మరణాలు.. 41 కేసులు

May 25 2020 2:32 AM | Updated on May 25 2020 4:20 AM

Coronavirus: 41 Fresh Positive Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనాతో ఆదివారం మరో నలుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 53కి చేరుకుంది. ఇక కొత్తగా మరో 41 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,854కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 23 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉండగా.. వలసదారులు 11 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఆరుగురు ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. తాజాగా 24 మంది కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1,092 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 709 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఆదివారం చనిపోయినవారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. జగిత్యాలకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోగా.. హైదరాబాద్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి శ్వాసకోశ వైఫల్యం, కరోనాతో మృతిచెందారు. హైదరాబాద్‌కు చెందిన 48 ఏళ్ల మహిళ కరోనాతోపాటు ల్యుకేమియాతో బాధపడుతూ చనిపోయారు. హైదరాబాద్‌కే చెందిన మరో 72 ఏళ్ల మహిళ కరోనాకు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా, హైదరాబాద్‌ కార్వాన్‌లోని బంజావాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బంజావాడిలో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఈ నెల 19న కరోనా రాగా, అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబానికి చెందిన 8 మందిని క్వారంటైన్‌కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా.. ఆదివారం ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు తేలింది.

క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపులు...
విదేశాల నుంచి వచ్చేవారి క్వారంటైన్‌ విషయంలో సడలింపులు ఇస్తూ కేంద్రం జారీచేసిన నూతన మార్గదర్శకాలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సంబంధిత అధికారులతో ఆదివారం ఫోన్‌లో సమీక్షించారు. తెలంగాణలోకి అడుగుపెడుతున్న విదేశీయులు ఇకపై ఏడు రోజుల పాటు హోటళ్లు, లాడ్జీలు, ఇతరత్రా క్వారంటైన్‌ కేంద్రాల్లో, మరో ఏడు రోజులపాటు హోంక్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందని ఐసీఎంఆర్‌ నూతన మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారిలో గర్భిణులు, కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, కుటుంబ సభ్యులు చనిపోయినవారు ఉంటే.. వారిని నేరుగా హోం క్వారంటైన్‌కి తరలించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థనతో ఈ మార్పులు చేసినందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు ఈటల కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి విమానాలు, రైళ్లు, బస్సుల ద్వారా వస్తున్న వారికి లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్‌కి తరలిస్తారన్నారు. కరోనా లక్షణాలు లేనివారు నేరుగా ఇంటికి వెళ్లవచ్చని, అయితే స్వీయ రక్షణ పాటించాలని మంత్రి కోరారు. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ 104, 108లను సంప్రదించాలని సూచించారు. హోం క్వారంటైన్‌లో ఉండే ప్రతి ఒక్కరినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఆసుపత్రులకు తరలించి పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రయాణికులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు సూచించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వైద్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement