ముట్టడి ఎఫెక్ట్‌: నగరంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌!

Congress Protest, Heavy Traffic Jam in Secunderabad-Panjagutta Route - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపునివ్వడంతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలివస్తుండటంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో ప్రగతి భవన్‌కు దారితీసే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ప్యారడైజ్‌నుంచి బేగంపేట వరకు ప్రస్తుతం వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది.


సికింద్రాబాద్‌ నుంచి పంజాగుట్ట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవ్వడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ఈ మార్గం మీదుగా ప్రగతి భవన్‌కు రాకుండా కాంగ్రెస్‌ శ్రేణులను నిలువరించేందుకు పోలీసులు బేగంపేటలో మోహరించారు. ఇక్కడ ఆందోళనకారులు కనిపించిన వెంటనే అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి ప్రగతి భవన్‌ వరకు ట్రాఫిక్‌ జామ్‌ కనిపిస్తోంది. వాహనదారులకు రోడ్డుమీద తీవ్ర పడిగాపులు తప్పడం లేదు. మరోవైపు ఈ మార్గంలోని మెట్రరైల్‌ స్టేషన్లలోనూ పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసనకారులు మెట్ర రైళ్లలో ప్రగతి భవన్‌కు చేరుకోకుండా ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు.

ఇక, సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కావడంతో నగరంలో రద్దీ భారీగా పెరిగింది. నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్‌ నిదానంగా కదులుతోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రయాణికులు, స్కూలు విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పలు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకుంది. నగరంలో చెప్పుకోదగిన స్థాయిలోని ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. అయితే, ఇవి ఏమాత్రం సరిపోని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు తగినంత అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు పెద్దసంఖ్యలో సెట్విన్‌ బస్సులపై ఆధారపడుతున్నారు. దీంతో సెట్విన్లు చోటులేనంతగా. కిక్కిరిసిపోతున్నాయి. పలుచోట్ల సెట్విన్‌బస్సుల్లో మహిళలు సైతం ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top