కాంగ్రెస్‌  రెబెల్స్‌పై వేటు

Congress Dismissed Rebel Candidates In The Party - Sakshi

తిరుగుబాటుదారులకు ఆరేళ్ల బహిష్కరణ

ఉమ్మడి జిల్లాలో  ఐదుగురిపై వేటు

ఐదు స్థానాల్లో రెబెల్స్‌గా బరిలో నేతలు

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌:
ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు తిరుగుబాటుదారులపై కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా సంఘం బహిష్కరణ వేటు వేసింది. పార్టీ టికెట్టు ఆశించి దక్కకపోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల గుర్తులపై పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు బహిష్కృతుల జాబితాలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 మంది కాంగ్రెస్‌ తిరుగుబాటుదారులను పార్టీ నుంచి బహిష్కరించగా, అందులో ఐదుగురు ఉమ్మడి జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. బహిష్కరణకు గురైన వారిలో రావి శ్రీనివాస్‌ (సిర్పూరు), బోడ జనార్దన్‌ (చెన్నూరు), అజ్మీరా హరినాయక్‌ (ఖానాపూర్‌), అనిల్‌జాదవ్‌ (బోథ్‌), బి.నారాయణరావు పటేల్‌ (ముథోల్‌) ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన విజ్ఞప్తులను తోసిరాదని వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వీరిని బహిష్కరించినట్లు క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ ఎం.కోదండ రెడ్డి ప్రకటించారు.

కాంగ్రెస్‌ అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్న రెబల్స్‌
ముథోల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి.రామారావు పటేల్‌కు సమీప బంధువైన మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరావు పటేల్‌ రెబల్‌గా మారారు. వీరిద్దరు టికెట్టు ఆశించగా, కాంగ్రెస్‌ పార్టీ రామారావు పటేల్‌కు అవకాశం ఇచ్చింది. దీంతో నారాయణరావు పటేల్‌ మహారాష్ట్రకు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కావడం, గ్రామాల్లో మంచి సంబంధాలు ఉండడంతో పాటు ఎన్‌సీపీ నుంచి పోటీ చేస్తుండడం వల్ల మహారాష్ట్ర మూలాలున్న ఓటర్లు ఆయన వైపు మొగ్గు చూపుతారేమోనని కాంగ్రెస్‌ ఆందోళన చెందుతోంది. సిర్పూరులో రావి శ్రీనివాస్‌ బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన రావి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌రెడ్డితో పాటు చేరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్పకు సమీప బంధువైన రావి శ్రీనివాస్‌ వల్ల తమకేమీ ఇబ్బంది లేదని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఎస్‌పీ నుంచి కోనప్ప పోటీ చేయగా, ఈసారి రావి శ్రీనివాస్‌ పోటీ చేస్తుండడం గమనార్హం. చెన్నూరు పార్టీ టికెట్టు కోసం మాజీ మంత్రి బోడ జనార్దన్‌ తీవ్రంగా కష్టపడ్డారు.
గ్రూపు–1 అధికారిగా రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన బోర్లకుంట వెంకటేష్‌ నేత గత కొంతకాలంగా చెన్నూరుపై పట్టు కోసం చేసిన ప్రయత్నాలను గుర్తించి పార్టీ టికెట్టు ఇచ్చింది. దీంతో అసంతృప్తికి గురైన బోడ జనార్దన్‌ బీఎల్‌ఎఫ్‌ తరుపున ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని పార్టీ నుంచి అగ్ర నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ, పోటీకే మొగ్గు చూపారు. ఖానాపూర్‌లో హరినాయక్, బోథ్‌లో అనిల్‌జాదవ్‌ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టికెట్టు ఆశించినప్పటికీ, మాజీ ఎమ్మెల్యేలు రమేష్‌ రాథోడ్‌ , సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరి టికెట్టు దక్కించుకున్నారు. వీరి ప్రభావం ఎన్నికల్లో ఎంత మేరకు ఉంటుందోనని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.   

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top