ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ కకావికలం.! | Congress Decreased in Asifabad District | Sakshi
Sakshi News home page

ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ కకావికలం.!

Mar 19 2019 3:28 PM | Updated on Mar 19 2019 3:30 PM

Congress Decreased in Asifabad District  - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. గతంలో ఈ ప్రాంతంలో అప్రతిహతంగా కొనసాగిన హస్తం పార్టీ హవా క్రమేపీ దిగజారుతోంది. ప్రస్తుతం జిల్లాలో పార్టీ అస్తిత్వమే కోల్పోయే ప్రమాదంలో పడింది. పార్టీకి మొన్నటి వరకూ వెలుగు దివ్వెలా ఉన్న ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం గులాబీ గూటికి చేరడంతో దిగువస్థాయి కార్యకర్తల్లో స్తబ్దత నెలకొంది. గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది స్థానాల్లో కేవలం ఆసిఫాబాద్‌ స్థానాన్ని మాత్రమే హస్తం పార్టీ  గెలుచుకుంది. సక్కు గెలుపుతో కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో కొంత పటిష్టంగానే ఉన్నట్లు కనిపించినా, ఆయన టీఆర్‌ఎస్‌లో చేరికతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. 


గతమెంతో ఘనం..
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ నియోజవర్గాల పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఏళ్ల పాటు తన హవా కొనసాగించింది. ఈ రెండు నియోజకవర్గాల చరిత్రలో ఆసిఫాబాద్‌లో తొమ్మిది సార్లు, సిర్పూర్‌లో ఆరుసార్లు కాంగ్రెస్‌ గెలుపొందింది. గ్రామస్థాయిలో బలమైన కేడర్‌తో పాటు సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా ఉండేది. అలాంటి స్థితి నుంచి ప్రస్తుతం మండలాల్లో ద్వితీయశ్రేణి నాయకులు సైతం కాంగ్రెస్‌ను వీడుతున్నారు. ఈనెల 22న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు జిల్లాలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.

అయితే జిల్లాలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉండడంతో ఆ ప్రచారంలో కోలాహలం కనిపించడం లేదు. దీంతో వచ్చిన నాయకుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. కాకపోతే ఆసిఫాబాద్‌తో పోల్చితే సిర్పూర్‌ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేసి ఓటమి పాలైన డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు గత కొంత కాలంగా తన కేడర్‌ను కాపాడుకుంటూ నియోజకవర్గంలో పార్టీని బతికిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన నాయకులు రేపో, మాపో పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరగుతోంది. 


ఆసిఫాబాద్‌లో పరిసమాప్తం.!
ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయినట్లు కనిపిస్తోంది. స్థానికంగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఎవరు కూడా ఎమ్మెల్యే సక్కు పార్టీ మార్పును వ్యతిరేకించడం లేదు. కనీసం ఒక్కసారి కూడా పార్టీ అధిష్టానం ఆదేశాలకనుగుణంగా నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. దీనికి తోడు మండలాలు, గ్రామాల్లో ఉన్న కేడర్‌ సైతం సక్కు వెంటే అంటూ రోజు రోజూ తీర్మానాలు చేస్తుండడంతో కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో తీవ్ర నష్టం చేకూరే ప్రమాదముంది.

అలాగే మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీలో చక్రం తిప్పే ఇద్దరు, ముగ్గురు నేతలు ఇంకా పార్టీ మారడంపై స్పష్టత కొరవడింది. సక్కు వెంట వెళ్లలేక, కాంగ్రెస్‌లో కొనసాగుదామా.? వద్దా.? అనే ఊగిసలాటలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎవరైనా నాయకులు వస్తే అడపదడపా కార్యక్రమాల్లో మాట్లాడడం చేస్తున్నారు కాని చురుకుగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఒకవేళ సక్కు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి సరైన అభ్యర్థి కూడా దొరకడం ప్రస్తుత పరిస్థితిలో కష్టమనే చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికలు రాకున్నా భవిష్యత్‌లోనూ సక్కు స్థాయి నేత మళ్లీ పార్టీలో ఎదగడం అనేది ఈ పరిస్థితిలో ఊహించడమే కష్టంగా ఉంది.


కార్యకర్తలను కలుస్తున్న సక్కు..
కాంగ్రెస్‌ను వదిలి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే సక్కు తన నియోజవర్గంలోని కార్యకర్తలను, అభిమానులు, తన వర్గానికి చెందిన వారిని క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పలకరిస్తున్నారు. తన నిర్ణయాన్ని కేడర్‌లోకి బలంగా తీసుకెళ్లి తను ఎటు వెళితే అటే అన్నట్లు తన అనచరగణాన్ని మలుచుకుంటున్నట్లు ఆయన నిర్వహిస్తున్న సమావేశాల తీరును చూస్తే కనిపిస్తోంది. అలాగే మరోనెల రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే తమ మద్దతు ఉండేట్లు తన అనుచరవర్గాన్ని సంసిద్ధం చేస్తున్నారు.

ముఖ్యంగా ఎవరూ కూడా తనను పార్టీ మారడం పట్ల వ్యతిరేకత చూపకుండా వీలైనంత ఎక్కువ మందిని కలసి తన నియోజవర్గ భవిష్యత్‌ ప్రణాళికను కేడర్‌కు చెప్పి ఒప్పిస్తున్నారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన నిర్ణయానికే కట్టుబడి ఉండేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌ దూకుడును తట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఏమేరకు ఓట్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement