దేశాన్ని సాకుతున్నాం

CM KCR About Telangana  State Budget in Assembly - Sakshi

దేశాన్ని సాకుతున్న ఆరేడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి 

అభివృద్ధిపథంలో పురోగమిస్తున్నాం

బడ్జెట్‌పై చర్చలో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశాన్ని సాకుతున్న ఆరేడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ తన కాళ్ల మీద తాను నిలబడటంతోపాటు దేశాభివృద్ధికి తోడ్పడుతోందని అన్నారు. ‘దేశంలో ప్రస్తుతమున్న వాస్తవ స్థితిగతులనే బడ్జెట్‌లో వివరించాం. అయినా కొందరు విమర్శలు చేశారు. దేశంలో ఆర్థికమాంద్యం ఉంది. దాని పరిణామాలు ఏఏ రంగాలపై ఉన్నయనే విషయాలను వివిధ పత్రికలు రాస్తున్నాయి. విశ్లేషకులు, జాతీయ, అంతర్జాతీయస్థాయి నిపుణులు, ఎన్డీఏ ప్రభుత్వానికి సలహాదారులుగా పనిచేసినవారు సైతం మాంద్యం విషయాలు బయటకు చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దేశ ఆర్థిక ముఖచిత్రం ఎలా ఉం డబోతోందనే చర్చ జరుగుతోంది. మూడేళ్లదాకా తేరుకోలేమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా చెప్తున్నారు. ఈ విశ్లేషణల నేపథ్యంలోనే బడ్జెట్‌ రూపొందించాం. ప్రగతి నిరోధకశక్తులు కొన్ని అడ్డుపడినా, వాటిని అధిగమించి 21 శాతం వృద్ధిరేటు సాధించాం. తెలంగాణ ఉద్యమ సందర్భంగా సమైక్యవాదుల ముందు ఎదైతే వాదించామో దాన్ని వంద శాతం నిజం చేశాం. రాష్ట్రం నుంచి రూ.2.70 కోట్లు పన్నులరూపంలో కేంద్రానికి వెళుతున్నాయి. రాష్ట్రానికి మాత్రం రూ.30 నుంచి రూ.31 వేల కోట్లు మాత్రమే వస్తున్నాయి’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లా ఆడిన మాట తప్పలేదు.. 
కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాను ఎలా విస్మరించిందో చెబుతూ కేసీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ హయాంలో మాదిరి ఇప్పు డు మతకల్లోలాలు, కర్ఫ్యూలు, ఆత్మహత్యలు, వలసలు, స్మగ్లర్లు, కరెంట్‌ కోతలు లేవని అన్నారు. హామీలిచ్చి నెరవేర్చనిది కాంగ్రెస్‌ పార్టీనేనన్నారు. ఆడిన మాట తప్పడం, అబద్ధాలడటం, అసత్యాలు చెప్పడం తమకు రాదని, ఇచ్చిన మాట మేరకు ప్రతిదీ నెరవేరుస్తామన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌ కట్టిన 7 ఇందిరమ్మ ఇళ్లు... ఇప్పుడు కడుతున్న ఒక డబుల్‌ బెడ్‌రూం ఇంటితో సమానమన్నారు. ఇంటికి రూ.20 వేల చొప్పున జేబులో వేసుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనని  కేసీఆర్‌ అన్నారు.  

జూన్‌ 2న తెలంగాణకు నిజమైన విముక్తి 
సెప్టెంబర్‌ 17పై సీఎం వివరణ ఇచ్చారు. ‘కొత్తగా మతం స్వీకరించినవాడికి నామాలెక్కువ’అన్న చందంగా దీనిపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారంటూ బీజేపీ తీరుపై మండిపడ్డారు. ‘సెప్టెంబర్‌ 17న ప్రతి ఏడాది తెలంగాణ భవన్‌పైన జాతీయ జెండా ఎగరవేస్తూనే ఉన్నా. ఎగురవేస్తూనే ఉంటా. ఆ రోజు ఎవరిపైనా ఎలాంటి ఆంక్షలు ఉండవు. అది రాజరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు పయనించిన రోజు. ఆ తర్వాత రెండేళ్లపాటు వేలమంది అమాయకులను ఊచకోతకు గురిచేశారు. కమ్యూనిస్టు పోరాటయోధులను చంపేశారు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తండ్రిని కాల్చి చంపారు’ అని గుర్తుచేశారు. ‘ఉద్యమ సమయంలో నేనూ విమోచనపై డిమాండ్‌ చేశా. తెలంగాణ వచ్చిన అనంతరం పాత గాయాలను రేపవద్దన్న మేధావుల సూచన మేరకు దాన్ని పక్కన పెట్టాం. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అనంతరం అరవై ఏళ్ల యాతన, పోరాటం, చావుల తరువాత 2014 జూన్‌ 2వ తేదీనే నిజమైన తెలంగాణ విముక్తి లభించింది. ప్రస్తుతం రాష్ట్రం సుకూన్‌గా ఉంది. శాంతియుతంగా ఉన్న తెలంగాణ ప్రశాంతతకు భంగం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు. 

కాళ్లలో కట్టె పెట్టొద్దని చెప్పా
అప్పుల విషయంలో అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలనే తెలంగాణ అనుసరిస్తోందని కేసీఆర్‌ అన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు, మిషన్‌ భగీరథక, అప్పులు తేవడం నేరమా? అని ప్రశ్నించారు. రూ.3 లక్షల కోట్లు అప్పులు చేశా మని ప్రజలను భయోత్పాతానికి గురిచేస్తున్నారని, తాము ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడే అప్పులు చేస్తున్నామని, ఎవరూ బెంబేలెత్తాల్సిన అవసరం లేదన్నారు. ఏడాదిలో అప్పులకు సంబంధించిన ఫలితాలు కనబడతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన అప్పు రెండు పంట లతో తీరుతుందన్నారు. రాష్ట్రాలపై కేంద్రం కర్రపెత్తనాన్ని మార్చుకోవాలని నీతి ఆయోగ్‌లో చెప్పామని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్రం మార్చుకోవాలన్నారు. పరిగెత్తేవాళ్ల కాళ్లలో కట్టె పెట్టొద్దని ప్రధానికే చెప్పానన్నారు.

నల్లమలను నాశనం కానివ్వం.. 
యురేనియం తవ్వకాలకు ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో అనుమతి ఇచ్చే ఆలోచన కూడా లేదన్నారు. నల్లమల అడవులను నాశనం కానివ్వబోమన్నారు. ‘శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, కృష్ణా డెల్టా కలుషితమై నాశనమయ్యే పరిస్థితి యురేనియం తవ్వకాల వల్ల వస్తుంది. హైదరాబాద్‌కు తాగునీటిని అందించే సాగర్‌ జలాలు కలుషితమయ్యే ప్రమాదముంది. 2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది’ అని చెప్పారు. కేంద్రం ఒకవేళ తవ్వకాలపై గట్టిగా ముందుకు వస్తే అందరం కలిసి కొట్లాడుదామన్నారు. దీనిపై అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానం చేయాలన్న భట్టి విక్రమార్క విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపిద్దామన్నా రు. యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభు త్వం అనుమతినిచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేశారు. 

అప్పులు రెన్యువల్‌ చేసుకోండి
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రైతుబంధును బీజేపీ మంత్రులే వచ్చి మెచ్చుకుంటున్నారన్నారు. ‘గతంలో రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ఏ ప్రభుత్వమూ కనికరించలేదు. ప్రస్తుతం గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల్లో రూ.5 లక్షలు పరిహారం ఇస్తున్నం. తెలంగాణలో అప్పులేని రైతు లేడు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంటు కచ్చితంగా ఇచ్చి తీరుతాం. రైతును రుణ విముక్తిడిని చేయడమే లక్ష్యం. రైతులు ఇప్పుడున్న అప్పులను రెన్యువల్‌ చేసుకోవాలని విన్నవిస్తున్నా. చెప్పిన మేరకు రూ.లక్ష రుణమాఫీ చేస్తాం’అన్నారు. కరెంట్‌పై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, దేశంలో ఏ రాష్ట్రమైనా 24 గంటల కరెంట్‌ను రైతులకు ఇస్తోందా? అని ప్రశ్నించారు. రైతులకు కరెంట్‌ ఇస్తుంటే కుంభకోణం అంటారా.. అని నిలదీశారు.  

సబ్‌ప్లాన్‌ నిధులను వేరేవాటికి వాడలేదు...
సబ్‌ప్లాన్‌ నిధులను మళ్లించామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, దళితులను ఆదుకునే విషయంలో తెలంగాణ చాంపియన్‌ కావాలని కేసీఆర్‌ అన్నారు. సబ్‌ప్లాన్‌కు కేటాయించిన రూ.54,350 కోట్లలో ప్రతీపైసా లెక్క చూపిస్తామన్నారు. అయితే శనివారం నాటి చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ పక్షనేత భట్టి విక్రమార్కను ఉద్దేశించి తాను మట్లాడిన పరుష పదజాలంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. భట్టి అబద్ధాలు చెబుతుంటే కోపం వచ్చిందని, అయితే ఇంటికి వెళ్లాక తాను బాధపడ్డానని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top