మధుర ఫలం.. విషతుల్యం

Carbide Use in Mango Market in Hyderabad - Sakshi

కార్బైడ్‌ స్థానంలో ఇథలిన్‌ పౌడర్‌ వినియోగం

మామిడి కాయలు మగ్గేందుకు వాడకం   

మాయాజాలం సృష్టిస్తున్న వ్యాపారులు

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

చర్యలకు ఉపక్రమించని యంత్రాంగం  

సాక్షి, సిటీబ్యూరో: వ్యాపారుల అత్యాశ కారణంగా మధుర ఫలం విషతుల్యంగా మారుతోంది. మామిడి పండ్లు త్వరగా మాగడానికి ఇథలిన్‌ను యథేచ్ఛగా వాడటంతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. పండ్లు పైకి నిగనిగా కనిపిస్తున్నా.. లోన మాత్రం ఎంతో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. కార్బైడ్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి పండ్ల ప్రియులు సంబరపడినా.. అది ఎంతో కాలం నిలవలేదు. వ్యాపారులు రూట్‌ మార్చి కార్బైడ్‌కు బదులుగా మరో రసాయన పౌడర్‌ బాట పట్టారు. సహజసిద్ధంగా కాకుండా కృత్రిమ పద్ధతికి అలవాటు పడ్డారు. త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఇథలిన్‌ పౌడర్‌ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్‌తో కాయలను కొన్ని గంటల్లోనే పండ్లుగా మార్చి విక్రయిస్తున్నారు.  

కోర్టు ఉత్తర్వులు బేఖాతర్‌..
ఆరోగ్యానికి హాని చేకూర్చే రసాయనాలను, రసాయన పౌడర్‌లను వినియోగించి పండ్లను మగ్గించవద్దని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజులు మార్కెట్‌లలో హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోయారు. ప్రలోభాలకు తలొగ్గిన అధికారులు వ్యాపారులు యథే చ్ఛగా రసాయన పౌడర్‌లను వినియోగిస్తున్నా చేష్టలుడిగి చూస్తున్నారనే ఆరోపణలున్నాయి.

చైనా నుంచి దిగుమతి..
కాలుష్య కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా చైనా, కొరియాల నుంచి ఇథలిన్‌ పౌడర్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి అనుమతి లేకపోయినప్పటికీ కాయలను 24 గంటల్లో నిగనిగలాడే పండ్లుగా మార్చేందుకు పౌడర్‌ను దొడ్డిదారిన వినియోగిస్తున్నారు. పౌడర్‌ను 5 ఎంఎల్‌ ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో బాక్స్‌ (15 నుంచి 35 కిలోల మామిడికాయల పెట్టె)లో మూడు నుంచి ఐదు ప్యాకెట్లు వేస్తున్నారు. వ్యాపారులు మాత్రం ఇథలిన్‌ ప్యాకెట్ల ద్వారా మగ్గబెట్టేందుకు అనుమతి ఉందనడం గమనార్హం.

పౌడర్‌ విక్రయాల్లోనూ బ్లాక్‌ దందా..
ఇథలిన్‌ పౌడర్‌ ప్యాకెట్ల విక్రయంలోనూ మార్కెట్‌లో బ్లాంక్‌ దందా చేస్తున్నారు. పౌడర్‌ ఒక్కో ప్యాకెట్‌ రూ.1.72కు కొనుగోలు చేస్తున్న ఓ కమిషన్‌ ఏజెంట్‌ ఆ ప్యాకెట్‌ను ఒక్కొక్కటి రూ.5కు బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. రోజుకు వేలాది ప్యాకెట్లను మార్కెట్‌లో విక్రయిస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు.

ఇలా నాలుగు రోజులు.. అలా 48 గంటల్లోపే..
సహజసిద్ధంగా గడ్డిలో పెట్టి మగ్గించిన మామిడికాయలు ఆరోగ్యానికి మంచివి. ఇలా మగ్గించాలంటే కనీసం 90 నుంచి 96 గంటల సమయం పడుతుంది. ఇంత సమయం దాకా ఆగలేని వ్యాపారులు కాల్షియం కార్బైడ్, ఇథలిన్‌ పౌడర్‌లాంటి మార్గాలను అనుసరిస్తున్నారు. వీటి ద్వారా 24 నుంచి 48 గంటల్లోపే కాయలు పండ్లుగా మారుస్తున్నారు. గడ్డిఅన్నారం మార్కెట్‌లో సుమారు 200 నుంచి 300 మంది మహిళలు, బాల కార్మికులు, హమాలీలు ఇథలిన్‌ పౌడర్‌ ప్యాకింగ్‌ పని చేస్తుండటం గమనార్హం.  

ఆరోగ్య సమస్యలు.. రుచిలో తేడాలు
గతంలో మామిడి కాయలను సహజసిద్ధంగా బట్టీలలో పక్వానికి తెచ్చే పద్ధతులు పాటించేవారు. మామిడి మధుర తీపి ప్రజలు రుచి చూసేవారు. నేడు కృత్రిమ పద్ధతులు, రసాయనాలతో మగ్గించడం వల్ల రుచిలో తేడాలొస్తున్నాయి. ఈ పండ్లను తినడం మూలంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దాడుల ఊసే లేదు..
మార్కెటింగ్‌ శాఖ అధికారులు, ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్‌ అధికారులు ఏటా మార్కెట్‌లో తనిఖీలు చేపట్టేవారు. దీంతో కొద్ది మేరైనా కల్తీని అరికట్టే అవకాశం ఉండేది. ఈ ఏడాది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పండ్ల మార్కెట్‌లో వ్యాపారులు నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. మార్కెట్‌ యార్డులో పదుల సంఖ్యలో సూపర్‌వైజర్లు, గ్రేడ్‌2, గ్రేడ్‌3 కార్యదర్శుల ద్వారా రోజూ వేలం పాటలు నిర్వహిస్తున్న అధికారులకు ఇథలిన్‌ పౌడర్‌ ప్యాకింగ్‌లు కనిపించడం లే దా.. అన్నది ఉన్నతాధికారులు ఆలోచించాలి.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
ఆహార భద్రతా శాఖ నిబంధనల మేరకు మాత్రమే కాయలను మగ్గించాలి. దీని కోసం మార్కెట్‌లో ఉన్న చాంబర్‌లను సద్వినియోగం చేసుకోవాలి. నిషేధిత రసాయనాలను వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. ఈ సంవత్సరం ఇప్పటికే మామిడి వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి రసాయన పౌడర్‌లను వినియోగించవద్దని చెప్పాం. ఇథలిన్‌ వినియోగించే వారిపై చర్యలు తీసుకుంటాం.
  – వెంకటేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి,గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top