
టైరు పేలి అదుపుతప్పి ఆటో, బైక్‌లను ఢీకొట్టిన కారు
కడ్తాల్: హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై కడ్తాల్ మండల కేంద్రం సమీపంలో టోల్‌ప్లాజా వద్ద కారు టైర్ పగిలి ఎదురుగా వస్తున్న ఆటోతో పాటు మూడు బైక్‌లను ఢీకొట్టిన సంఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న కారు టైర్ కడ్తాల్ టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కూరగాయల ఆటోతో పాటు మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ సంఘటనలో బైక్‌లపై ఉన్న కడ్తాల్‌కు చెందిన నార్లకంటి యాదయ్య, జల్కం బీరప్ప, మరో బైక్‌పై ఉన్న కాలె శ్రీను, ఒగ్గు మహేశ్, ఇంకో బైక్‌పై ఉన్న పాపయ్య, హేమలత, ఆటోలో ఉన్న సుజాత, జ్యోతి, వెంకటేశ్‌లకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో ఆమనగల్లు, హైదరాబాద్ ఆస్పత్రిలకు తరలించారు. వీరిలో కడ్తాల్‌కు చెందిన నార్లకంటి యాదయ్యకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.