ఆమాత్యుల రేసులో... ఆ ముగ్గురు | Sakshi
Sakshi News home page

ఆమాత్యుల రేసులో... ఆ ముగ్గురు

Published Sat, Jul 12 2014 3:06 AM

ఆమాత్యుల రేసులో... ఆ ముగ్గురు - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ; నెలాఖరులో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జూన్ రెండో తేదీన ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వ కేబినెట్‌లో జిల్లాలో ఎవరికీ చోటు దక్కలేదు. దీంతో మలి విడత మంత్రివర్గ విస్తరణపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భారీ ఆశలు పెట్టుకున్నారు. సాధారణ ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్‌ఎస్ పక్షాన ఏడుగురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో జూపల్లి కృష్ణారావు     (కొల్లాపూర్), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) మంత్రి పదవిపై భారీగా లెక్కలు వేసుకుంటున్నారు. మలివిడత మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు కూడా ప్రకటించారు.

దీంతో మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో సీఎం కేసీఆర్‌తో పాటు హరీష్‌రావు, కేటీ రామారావులకు ఇప్పటికే చోటు దక్కింది. దీంతో ఇదే సామాజికవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావుకు కుల సమీకరణాలు అడ్డువస్తున్నాయి. అయితే దక్షిణ తెలంగాణ నుంచి ఈ సామాజికవర్గం నుంచి వేరెవరూ లేకపోవడంతో కృష్ణారావుకు మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది.

జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి విషయంలోనూ ఇవే సమీకరణాలు ఆటంకంగా కనిపిస్తున్నాయి. మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), జగదీష్‌రెడ్డి (నల్లగొండ), నాయిని నర్సింహారెడ్డి (హైదరాబాద్)కు ఇప్పటికే చోటు కల్పించినందున లక్ష్మారెడ్డికి తొలివిడత మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగడం, 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఓటమిపాలు కావడం వంటి కారణాలు కలిసి వస్తాయని లక్ష్మారెడ్డి అంచనా వేసుకుంటున్నారు.
 
ఉద్యమ కోటాపై గౌడ్ ఆశలు
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షుడిగా ఉంటూ టీఆర్‌ఎస్ పక్షాన ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీనివాస్‌గౌడ్ మంత్రివర్గంలో స్థానం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన మరో ఉద్యోగ సంఘం మాజీ నేత స్వామిగౌడ్‌కు శాసనమండలి ఛైర్మన్ పదవి దక్కడంతో తనకు లైన్ క్లియర్ అయినట్లేనని శ్రీనివాస్‌గౌడ్ అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇదే సామాజికవర్గానికి చెందిన పద్మారావుకు తొలివిడత మంత్రివర్గంలోనే చోటు దక్కడంతో కుల సమీకరణాల కోణంలో శ్రీనివాస్‌గౌడ్ అవకాశాలు సంక్లిష్టంగా కనిపిస్తున్నాయి.

ఓ వైపు ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తుండగా, మరికొందరు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ వ్యాపారవేత్త తెలంగాణ పారిశ్రామిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ ైచైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.ఎమ్మెల్యే టికెట్ ఆశించినా ఇతరుల కోసం సర్దుబాటుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవర మల్లప్ప ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.

గద్వాల నుంచి  ఓట మి పాలైన కృష్ణమోహన్ రెడ్డి కూడా ప్రాధాన్యత కలిగిన కార్పొరేషన్ ఛైర్మన్‌గా అవకాశం వస్తుందనే అంచనాలో ఉన్నారు. మున్సిపల్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక ముగి యడంతో ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవుల కోసం విన్నపాలతో సిద్ధమవుతున్నారు. మార్కెట్ కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల ద్వారా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement