ఫ్రెండ్లీగా పనిచేద్దాం..

C narayana Reddy took Over Charge As A Nizamabad Collector - Sakshi

ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించను

ఉద్యోగులను సున్నితంగా హెచ్చరించిన..

కలెక్టర్‌ నారాయణరెడ్డి

బాధ్యతలు చేపట్టగానే అన్నిశాఖల పరిశీలన

తొలిరోజే తనదైన మార్క్‌

‘అనుమతి లేకుండా జిల్లా అధికారులు, ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది విధులకు గైర్హాజరైతే కఠినంగా ఉంటా.. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండి ఆలస్యంగా వస్తే ఊరుకోను... ఈ విషయాల్లో ఇప్పటికే ములుగు జిల్లాలో 26 మందిని సస్పెండ్‌ చేసి వచ్చాను’. అంటూ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణరెడ్డి సున్నితంగా హెచ్చరించారు. విధులను నిర్లక్ష్యం చేయకుండా ఫ్రెండ్లీగా పని చేసుకుందామన్నారు.

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డి తొలిరోజే తన మార్క్‌ను ప్రదర్శించారు. కల్టెరేట్‌లోని అన్ని శాఖలను సందర్శించి ఉద్యోగులతో మాట్లాడారు. ఎన్నికల సెక్షన్‌లో సంబంధిత తహసీల్దార్, కిందిస్థాయి ఉద్యోగులు చెప్పే వివరాలు పొంతన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అధికారి లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారని కిందిస్థాయి సిబ్బందిని ప్రశ్నించి ఎవరి అనుమతి తీసుకుని వెళ్లారో తనకు తెలపాలన్నారు. కలెక్టరేట్‌ నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులతో రెండు గంటలకు పైగా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అన్ని శాఖలకు వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, ప్రతి విషయాన్ని తనకు తెలియజేయాలన్నారు. అనంతరం నూతన కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణాన్ని పరిశీలించారు.

బాధ్యతలు చేపట్టగానే జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి  మంగళవారం కలెక్టరేట్‌లోని అన్ని జిల్లా కార్యాలయాలను తిరిగి పరిశీలించారు. ముందుగా కలెక్టర్‌ పరిపాలనా విభాగంలోని డీఆర్వో చాంబర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి సెక్షన్‌ల వారీగా అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నా రు. అక్కడే ఉన్న కాల్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఎన్నికల సెక్షన్‌లో సంబంధిత తహసీల్దా ర్, కిందిస్థాయి ఉద్యోగులు చెప్పే వివరాలు పొంతన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. టాయిలెట్ల నుంచి దుర్వాసన రావడంతో వాటిని క్లీన్‌గా ఉంచాలని ఆదేశించారు. అనంతరం స్ట్రాంగ్‌ రూం, వీడి యో కాన్ఫరెన్స్‌ గదిని పరిశీలించారు. పక్కనే గల రికా ర్డు గదికి వెళ్లారు. అక్కడ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో రికార్డులను భద్రంగా ఉంచేందుకు అవసరమైన నిధులు తానిస్తానన్నారు.

కలెక్టరేట్‌ పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తతో నిండి ఉండడంతో అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్‌ రెండు, మూడు రోజుల్లోగా కార్యాలయం పరిశుభ్రంగా కనిపించాలని, చెట్టు దిమ్మెలకు రంగులు వేయాలని కలెక్టరేట్‌ పరిపాలనా అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌ సమావేశ మందిరాన్ని, అక్కడి నుంచి పెన్షన్, డీఆర్‌డీఓ, ఉపాధిహామీ, ఐసీడీఎస్, ఇతర విభాగాలను పరిశీలించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ కార్యాలయాలు పరిశీలించారు. ప్రగతిభవన్‌ దగ్గర పాడైన నీటి యంత్రాన్ని తొలగించాలని లేదా కొత్తదైనా ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ కార్యాలయం, ప్రగతిభవన్‌ గోడలపై ఉన్న మొక్కలు, చెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. 

బీసీ వెల్ఫేర్‌ ఉద్యోగులకు హెచ్చరిక... 
బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్లగానే జిల్లా అధికారి శంకర్‌ లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారని కిందిస్థాయి సిబ్బందిని ప్రశ్నించారు. కోర్టు పనిమీద వెళ్లారని చెప్పారు. ఎవరి అనుమతి తీసుకుని వెళ్లారో తనకు తెలపాలన్నారు. అక్కడే ఉద్యోగులతో మాట్లాడిన కలెక్టర్‌... అనుమతి లేకుండా ఎవరైనా విధులకు గైర్హాజరైతే ఊరుకోనని, కఠినంగా ఉంటానని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య ఉన్నారు.

ప్రతి శాఖ వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేయాలి 
ప్రతి శాఖ జిల్లా స్థాయిలో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి తన ఫోన్‌ నంబర్, సీసీ నంబరు యాడ్‌ చేసి శాఖా పరంగా జరుగుతున్న ప్రతి విషయం తనకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులతో రెండు గంటలకు పైగా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.అధికారికంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ప్రొటోకాల్‌ పాటించాలని, డివిజన్‌లో ఆర్డీవోను, జిల్లాలో డీఆర్వో కార్యాలయాన్ని సంప్రదించాలన్నా రు. అధికారులు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి సాయంత్రం కార్యాలయ విధులు నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో సిబ్బందిచే బాగా పని చేయించడానికి ఎంపీడీఓలు, తహసీల్దా ర్లు, మున్సిపల్‌ కమిషనర్లు పట్టు సాధించాలన్నారు. సెలవు రోజుల్లో ఇబ్బంది పెట్టనని, ఆరోగ్యం పాడు చేసుకోవాల్సి పని లేదని, పని రోజుల్లో మాత్రం అనుమతి లేకుండా గైర్హాజరైతే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ఏ స్థాయి సమస్యలు ఆ స్థాయిలోనే పరిష్కారం కావాలని, జిల్లా స్థాయికి వస్తే మాత్రం మొహమాటం లేకుండా కలానికి పని చెప్పా ల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజావాణి అద్భుతంగా జరగాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి షెడ్యులు విడుదలైనందున వార్డుల వారీగా ఫొటో ఎలక్ట్రోల్‌ జాబితా 30న ప్రచురించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నా రు. నూరుశాతం తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా సిద్ధ చేసుకోవాలని, అభ్యంతరాలన్నీ రిజిస్టర్లలో నమోదు చేసి పరిష్కరించాలన్నారు. అలాగే పల్లె ప్రగతి కార్యక్రమానికి మించినది మరొకటి లేదని, గ్రామాల్లో మార్పులు తేవడానికి కృషి చేయాలన్నారు. అర్హత గల రైతులందరికీ పాసు పుస్తకాలివ్వాలని, ఇబ్బందులు పెడితే ఉపేక్షించనన్నారు. 

కలెక్టరేట్‌ భవన సముదాయం పరిశీలన... 
జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ కళాశాల వద్ద జరుగుతున్న నూతన కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణాన్ని కలెక్టర్‌ నారాయణరెడ్డి పరిశీలించారు. అధికారులతో కలియతిరిగి అన్ని వివరాలు, మ్యాప్‌ను పరిశీలించారు. వీలైనంత త్వరగా భవనాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య, డీఎఫ్‌ఓ సునీల్, జడ్పీ సీఈఓ గోవింద్, డీపీఓ జయసుధ, ఇతర జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top