జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు

Bathukamma Sarees Distribution In Karimnagar - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆడపడుచులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న బతుకమ్మ చీరలు జిల్లాకు చేరాయి. తొమ్మిది రోజుల పాటు సందడి వాతావరణంలో జరిగే తీరొక్క పూల పండుగకు ఈ సారి ప్రభుత్వం ముందస్తుగానే ఆలోచన చేసింది. దసరా పండుగకు ముందే మహిళా లబ్ధిదారులకు ‘కానుక’ అందజేయనుంది. ప్రభుత్వ ఈ పథకానికి గతేడాది శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందజేస్తోంది.

అయితే తెల్లరేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల్లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. అయితే గతేడాది మాదిరి కాకుండా ఈ సారి రూ.300 నుంచి రూ.350 విలువైన బార్డర్‌ అంచుతో ఉన్న పాలిస్టర్‌ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో ఎంత మంది మహిళలు ఉన్నారనే వివరాలను అధికారులు సేకరించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి కూడా మహిళా లబ్ధిదారుల వివరాలు అందాయి. అయితే జిల్లాకు వచ్చిన చీరలను త్వరలో పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాకు 1.19 లక్షల చీరలు..
జిల్లాలోని 18 మండలాల పరిధిలో 2,37,867 మంది మహిళా లబ్ధిదారులు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమన్వయంగా గుర్తించారు. అయితే పంపిణీ బాధ్యతను మాత్రం గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది. జిల్లాకు మొదటి విడతగా లక్షా 19 వేల చీరలు వచ్చాయి. జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరలను ఆయా మార్కెట్‌ యార్డుల్లోని గోదాముల్లో భద్రంగా ఉంచారు. జిల్లా కేంద్రంలో గల మార్కెట్‌ యార్డులో 38 వేల చీరలు అందుబాటులో ఉంచగా, ఇచ్చోడ మార్కెట్‌లో 48,480 చీరలు, నార్నూర్‌ మార్కెట్‌లో 20 వేలు, ఇంద్రవెల్లి మార్కెట్‌లో 28 వేల చీరలను భద్రపర్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా చీరలు రాకపోవడంతో రెండో విడత చీరలు సరఫరా చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. గోదాముల నుంచి గ్రామాలకు చీరలు సరపరా చేసి ఆయా గ్రామాల్లోనే మహిళలకు పంపిణీ చేయనున్నారు. అయితే ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్‌ పండుగలను పురస్కరించుకొని మైనార్టీలకు, క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో హిందూ మహిళలకు సైతం చీరలు పంపిణీ చేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు సమాచారం.

గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ.. 
గతేడాది చీరల నాణ్యతపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి వ్యతిరేకత ఈసారి రాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. పంపిణీ సమయంలో కొత్త చీరలు నలిగిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. అయితే ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేయనుండడంతో రాష్ట్రంలోని చేనేత కార్మిక కుటుంబాలకు చాలా వరకు ఉపాధి దొరకడంతో పాటు చేనేత వస్త్రాలపై ప్రజలకు కూడా అవగాహన వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే జిల్లాకు వచ్చిన చీరలను గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టనున్నారు. ఈ సారి మహిళా సంఘాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, రేషన్‌ డీలర్లు చీరలను పంపిణీ చేసే అవకాశాలున్నాయి. పంపిణీకి రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సైతం సహకరించనున్నారు. కాగా, ఈ ఏడాది బతకుమ్మ సంబరాలు అక్టోబర్‌లో జరుగనున్నాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top