breaking news
Revenue - police officers
-
జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు
ఆదిలాబాద్‌అర్బన్: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆడపడుచులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న బతుకమ్మ చీరలు జిల్లాకు చేరాయి. తొమ్మిది రోజుల పాటు సందడి వాతావరణంలో జరిగే తీరొక్క పూల పండుగకు ఈ సారి ప్రభుత్వం ముందస్తుగానే ఆలోచన చేసింది. దసరా పండుగకు ముందే మహిళా లబ్ధిదారులకు ‘కానుక’ అందజేయనుంది. ప్రభుత్వ ఈ పథకానికి గతేడాది శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందజేస్తోంది. అయితే తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. అయితే గతేడాది మాదిరి కాకుండా ఈ సారి రూ.300 నుంచి రూ.350 విలువైన బార్డర్ అంచుతో ఉన్న పాలిస్టర్ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో ఎంత మంది మహిళలు ఉన్నారనే వివరాలను అధికారులు సేకరించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి కూడా మహిళా లబ్ధిదారుల వివరాలు అందాయి. అయితే జిల్లాకు వచ్చిన చీరలను త్వరలో పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు 1.19 లక్షల చీరలు.. జిల్లాలోని 18 మండలాల పరిధిలో 2,37,867 మంది మహిళా లబ్ధిదారులు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమన్వయంగా గుర్తించారు. అయితే పంపిణీ బాధ్యతను మాత్రం గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది. జిల్లాకు మొదటి విడతగా లక్షా 19 వేల చీరలు వచ్చాయి. జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరలను ఆయా మార్కెట్ యార్డుల్లోని గోదాముల్లో భద్రంగా ఉంచారు. జిల్లా కేంద్రంలో గల మార్కెట్ యార్డులో 38 వేల చీరలు అందుబాటులో ఉంచగా, ఇచ్చోడ మార్కెట్లో 48,480 చీరలు, నార్నూర్ మార్కెట్లో 20 వేలు, ఇంద్రవెల్లి మార్కెట్లో 28 వేల చీరలను భద్రపర్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా చీరలు రాకపోవడంతో రెండో విడత చీరలు సరఫరా చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. గోదాముల నుంచి గ్రామాలకు చీరలు సరపరా చేసి ఆయా గ్రామాల్లోనే మహిళలకు పంపిణీ చేయనున్నారు. అయితే ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్ పండుగలను పురస్కరించుకొని మైనార్టీలకు, క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో హిందూ మహిళలకు సైతం చీరలు పంపిణీ చేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ.. గతేడాది చీరల నాణ్యతపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి వ్యతిరేకత ఈసారి రాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. పంపిణీ సమయంలో కొత్త చీరలు నలిగిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. అయితే ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేయనుండడంతో రాష్ట్రంలోని చేనేత కార్మిక కుటుంబాలకు చాలా వరకు ఉపాధి దొరకడంతో పాటు చేనేత వస్త్రాలపై ప్రజలకు కూడా అవగాహన వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే జిల్లాకు వచ్చిన చీరలను గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టనున్నారు. ఈ సారి మహిళా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, రేషన్ డీలర్లు చీరలను పంపిణీ చేసే అవకాశాలున్నాయి. పంపిణీకి రెవెన్యూ, పోలీస్ అధికారులు సైతం సహకరించనున్నారు. కాగా, ఈ ఏడాది బతకుమ్మ సంబరాలు అక్టోబర్‌లో జరుగనున్నాయి. -
రెవెన్యూ ఉద్యోగుల వర్క్ టు రూల్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రెవెన్యూ - పోలీసు అధికారుల మధ్య నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. చివరకు ఎన్నికల విధులపై తీవ్ర ప్రభావం చూపనుంది. రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై పోలీసు అధికారులు దౌర్జన్యం చేసినా ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రెవెన్యూ కాన్ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం వర్క్ టు రూల్ పాటించారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తించారు. గ్రామ రెవెన్యూ సహాయకుడి నుంచి తహశీల్దార్ వరకు వర్క్ టు రూల్ పాటించడంతో సాయంత్రానికి రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగాలు ఖాళీగా కనిపించాయి. జిల్లా ఎన్నికల అధికారి స్పందించకుంటే శుక్రవారం కూడా వర్క్ టు రూల్ పాటించాలని రెవెన్యూ కాన్ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీన జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో మార్కాపురం డివిజన్ బద్వీడు పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న పెద్దారవీడు తహశీల్దార్‌తో పాటు సిబ్బందిపై ఒంగోలు టూటౌన్ సీఐ సూర్యనారాయణ దౌర్జన్యానికి దిగడం, అది జరిగి నాలుగు రోజులు తిరగకుండానే కొండపి మండలం ఇలవరలో ఎన్నికల విధుల్లో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకుడిపై సీఐ లక్ష్మణ్ తప్పుడు కేసు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని నాయకులు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సీఐ సూర్యనారాయన విధులు నిర్వర్తించడం, విచారణకు సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపించకపోవడాన్ని రెవెన్యూ కాన్ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించింది. అందులో భాగంగా వర్క్ టు రూల్‌కు సిద్ధమైంది. నిలిచిన పోస్టల్ బ్యాలెట్ వెరిఫికేషన్ మరో 12 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సమయంలో వర్క్ టు రూల్‌తో తీవ్ర ఆటంకం కలిగింది. పోస్టల్ బ్యాలెట్ వెరిఫికేషన్ నిలిచిపోయింది. శుక్రవారం కూడా వర్క్ టు రూల్ పాటించేందుకు రెవెన్యూ కాన్ఫెడరేషన్ సన్నద్ధం అవుతోంది. జిల్లా ఎన్నికల అధికారి వెంటనే జోక్యం చేసుకోకుంటే ఎన్నికల విధులకు విఘాతం కలిగే అవకాశం ఉంది.