ఆటిజం కాదు శాపం

Autism awareness day Special Story - Sakshi

సరైన శిక్షణతో సమస్యను అధిగమించొచ్చు

తల్లిదండ్రులకు అవగాహన తప్పనిసరి అంటున్న నిపుణులు

నేడు ఆటిజం అవగాహన దినం

సాక్షి, సిటీబ్యూరో :నగరంలో బాధిత చిన్నారుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. స్వల్పకాలంలోనే పదుల సంఖ్యలో వెలసిన ఆటిజం చికిత్సా కేంద్రాలే ఇందుకు  ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఆటిజం స్కూల్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. తల్లిదండ్రులు పూర్తిగా వాటి మీదే భారం వేసి ఊరుకోకూడదని తమ వంతుగా తమ బిడ్డ విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు యాద ఏబీఏ సెంటర్‌ డైరెక్టర్, రాష్ట్రంలోని సర్టిఫైడ్‌ బిహేవియర్‌ ఎనలిస్ట్‌  హారిక పట్లోళ్ల. ఆమె తల్లిదండ్రులకు అందిస్తున్న సూచనలిలు

ఆలస్యంతో నష్టం
వీలైనంత త్వరగా తమ పిల్లల ఆటిజం లక్షణాలను పేరెంట్స్‌ గుర్తించగలగాలి. పిల్లల ఎదుగుదలను సునిశితంగా పరిశీలిస్తుంటే ఐకాంటాక్ట్‌ సరిగా లేకపోవడం, పేరు పెట్టి పిలిచినా స్పందించకపోవడం, చెప్పిన సూచనలు అర్థం చేసుకోలేకపోవడం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లోపం.. వంటి ఆటిజం లక్షణాలను గుర్తించవచ్చు. లక్షణాలు గుర్తించాక సరైన, అధీకృత చికిత్సను ఎంత వేగంగా ఎంచుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఆలస్యం అయినకొద్దీ సమస్య పరిష్కారం మరింత జఠిలమవుతుందని గుర్తించాలి.

కుంగిపోవద్దు
తమ బిడ్డకు ఆటిజం ఉందని గుర్తించాక తల్లిదండ్రులు ఎంత మాత్రం కుంగిపోకూడదు. భవిష్యత్తులో ఏం జరిగిపోతుందో అనే భయాందోళన విడిచిపెట్టి వాస్తవాన్ని అంగీకరించి తమ బిడ్డ ఎదుర్కుంటున్న సమస్యలు వాటి పరిష్కారాలపైనే పూర్తిగా దృష్టి సారించాలి. సంతోషంగా, ఇష్ట పూర్వకంగా తప్ప ఒత్తిడి చేసి, రుద్దడం ద్వారా నేర్చుకోవడానికి ఈ తరహా పిల్లలు ఇష్టపడరనేది తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. అలా నేర్చుకున్నవి మాత్రమే శాశ్వతంగా ఉంటాయి.

సరైన పద్ధతిలో నేర్పించాలి
నేర్చుకోవడం అనేది మాత్రమే ఆటిజం చిన్నారుల జీవనశైలిని మారుస్తుంది. కాబట్టి అదొక నిర్విరామ ప్రక్రియగా కొనసాగుతూనే ఉండాలి. ఆటిజం చిన్నారులు చాలా నేర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అయితే వాళ్లకు తగిన పద్ధతుల్లో నేర్పితే మాత్రమేనని గమనించాలి.  తల్లిదండ్రులు చికిత్స ప్రారంభించాక కూడా తమ బిడ్డ ఎదుగుదలను సునిశితంగా పరిశీలించాలి. ప్రతి మార్పు చేర్పును జాగ్రత్తగా గమనించి నోట్‌ చేసుకుంటుండాలి.  

ఆధారపడకపోవడం ముఖ్యం
పాఠశాల చదువు ముఖ్యమైనదే. అయితే ఆటిజం బాధిత చిన్నారి విషయంలో కోరుకోవాల్సింది తన జీవితం తాను ఎవరి మీదా ఆధారపడకుండా బతకాలని. ఆ దిశగానే తల్లిదండ్రుల ఆలోచనలు ఉండాలి. తమ చిన్నారి ఎవరి మీదా ఆధారపడకుండా పనులు చేసుకోవడాన్ని ప్రోత్సహించే క్రమంలో ఖచ్చితత్వం గురించి ఆరాటపడకూడదు. తప్పటడుగుల నుంచే మంచి మార్పులు మొదలవుతాయని ఓర్పుతో వేచి ఉండాలి.

నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరపాలి
ఆటిజం చికిత్సలో ప్రొఫెషనల్స్‌ సహకారం తీసుకుంటూ వారితో నిత్యం సంప్రదింపులు జరుపుతుండాలి. ఏ రకమైన మార్పు చేర్పులు, లేదా అనూహ్యమైన ధోరణుల్ని గమనించినా వెంటనే శిక్షకులకు తెలియజేయాలి. అంతేకాదు ఆటిజం చికిత్స అనేది దీర్ఘకాలం పట్టేది కాబట్టి ఈ విషయంలో ముందుగానే సిద్ధమవ్వాలి. ఏవైనా సమస్యలు ఉంటే సలహాల కోసం ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు.– హారిక పట్లోళ్ల, యాద ఏబీఏ సెంటర్, అత్తాపూర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top