autism patient
-
ఆటిజం కాదు శాపం
సాక్షి, సిటీబ్యూరో :నగరంలో బాధిత చిన్నారుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. స్వల్పకాలంలోనే పదుల సంఖ్యలో వెలసిన ఆటిజం చికిత్సా కేంద్రాలే ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఆటిజం స్కూల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. తల్లిదండ్రులు పూర్తిగా వాటి మీదే భారం వేసి ఊరుకోకూడదని తమ వంతుగా తమ బిడ్డ విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు యాద ఏబీఏ సెంటర్ డైరెక్టర్, రాష్ట్రంలోని సర్టిఫైడ్ బిహేవియర్ ఎనలిస్ట్ హారిక పట్లోళ్ల. ఆమె తల్లిదండ్రులకు అందిస్తున్న సూచనలిలు ఆలస్యంతో నష్టం వీలైనంత త్వరగా తమ పిల్లల ఆటిజం లక్షణాలను పేరెంట్స్ గుర్తించగలగాలి. పిల్లల ఎదుగుదలను సునిశితంగా పరిశీలిస్తుంటే ఐకాంటాక్ట్ సరిగా లేకపోవడం, పేరు పెట్టి పిలిచినా స్పందించకపోవడం, చెప్పిన సూచనలు అర్థం చేసుకోలేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం.. వంటి ఆటిజం లక్షణాలను గుర్తించవచ్చు. లక్షణాలు గుర్తించాక సరైన, అధీకృత చికిత్సను ఎంత వేగంగా ఎంచుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఆలస్యం అయినకొద్దీ సమస్య పరిష్కారం మరింత జఠిలమవుతుందని గుర్తించాలి. కుంగిపోవద్దు తమ బిడ్డకు ఆటిజం ఉందని గుర్తించాక తల్లిదండ్రులు ఎంత మాత్రం కుంగిపోకూడదు. భవిష్యత్తులో ఏం జరిగిపోతుందో అనే భయాందోళన విడిచిపెట్టి వాస్తవాన్ని అంగీకరించి తమ బిడ్డ ఎదుర్కుంటున్న సమస్యలు వాటి పరిష్కారాలపైనే పూర్తిగా దృష్టి సారించాలి. సంతోషంగా, ఇష్ట పూర్వకంగా తప్ప ఒత్తిడి చేసి, రుద్దడం ద్వారా నేర్చుకోవడానికి ఈ తరహా పిల్లలు ఇష్టపడరనేది తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. అలా నేర్చుకున్నవి మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. సరైన పద్ధతిలో నేర్పించాలి నేర్చుకోవడం అనేది మాత్రమే ఆటిజం చిన్నారుల జీవనశైలిని మారుస్తుంది. కాబట్టి అదొక నిర్విరామ ప్రక్రియగా కొనసాగుతూనే ఉండాలి. ఆటిజం చిన్నారులు చాలా నేర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అయితే వాళ్లకు తగిన పద్ధతుల్లో నేర్పితే మాత్రమేనని గమనించాలి. తల్లిదండ్రులు చికిత్స ప్రారంభించాక కూడా తమ బిడ్డ ఎదుగుదలను సునిశితంగా పరిశీలించాలి. ప్రతి మార్పు చేర్పును జాగ్రత్తగా గమనించి నోట్ చేసుకుంటుండాలి. ఆధారపడకపోవడం ముఖ్యం పాఠశాల చదువు ముఖ్యమైనదే. అయితే ఆటిజం బాధిత చిన్నారి విషయంలో కోరుకోవాల్సింది తన జీవితం తాను ఎవరి మీదా ఆధారపడకుండా బతకాలని. ఆ దిశగానే తల్లిదండ్రుల ఆలోచనలు ఉండాలి. తమ చిన్నారి ఎవరి మీదా ఆధారపడకుండా పనులు చేసుకోవడాన్ని ప్రోత్సహించే క్రమంలో ఖచ్చితత్వం గురించి ఆరాటపడకూడదు. తప్పటడుగుల నుంచే మంచి మార్పులు మొదలవుతాయని ఓర్పుతో వేచి ఉండాలి. నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరపాలి ఆటిజం చికిత్సలో ప్రొఫెషనల్స్ సహకారం తీసుకుంటూ వారితో నిత్యం సంప్రదింపులు జరుపుతుండాలి. ఏ రకమైన మార్పు చేర్పులు, లేదా అనూహ్యమైన ధోరణుల్ని గమనించినా వెంటనే శిక్షకులకు తెలియజేయాలి. అంతేకాదు ఆటిజం చికిత్స అనేది దీర్ఘకాలం పట్టేది కాబట్టి ఈ విషయంలో ముందుగానే సిద్ధమవ్వాలి. ఏవైనా సమస్యలు ఉంటే సలహాల కోసం ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు.– హారిక పట్లోళ్ల, యాద ఏబీఏ సెంటర్, అత్తాపూర్ -
ఆటిజాన్ని తరిమి.. పాటల రారాణి!
సంగీతమే ఆమె భాష. ఆమె ఆత్మ, ఆమె జీవితం. ఆదే ఆమె శక్తి. అదే ఆమె ప్రపంచం. సంగీతం లేకుండా నేడు ఆమె లేదు. మూగ, చెవుడు లాంటి (ఆటిజం) అవలక్షణాలతో పుట్టిన ఆమె 'మ్యూజిక్ థెరపీ' ద్వారా క్రమంగా ఆటిజంను జయించి నేడు ప్రముఖ గాయకురాలిగా ఎదిగింది. ఆమె 22 ఏళ్ల బెంజీ కుమార్. మూడు జాతీయ అవార్డులను అందుకోవడంతో పాటు 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు సాధించింది. ప్రపంచ ఆల్బంలలో చోటు సంపాదించుకుంది. బాలీవుడ్ రీమిక్సులు పాడటంలో ఆమెకు ఆమే సాటి. నేటి వరకు 8 ఆడియో సీడీలను విడుదల చేయడం ద్వారా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. ఆమె ఈ స్థాయికి ఎదగడానికి ఆమె తల్లి కవితా కుమార్ కారణం. రెండేళ్ల వయసులోనే బెంజీ కుమార్‌కు ఆటిజం ఉన్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు. ఎన్నో ఆస్పత్రులు తిప్పారు. ఎన్నో మందులు వాడారు. జబ్బు తగ్గలేదు. చెవులు వినిపించేవి కావు. నోటి నుంచి మాట వచ్చేది కాదు. బతకడం కూడా కష్టమేనని డాక్టర్లు చెప్పారు. ఆమె మూడో ఏట మ్యూజిక్ టాయ్‌కి ఆ పాప కొద్దిగా స్పందించడం తల్లి కవిత గుర్తించింది. ఆ రోజు నుంచి పాప కోసం తానే సంగీతం టీచరయింది. పాటలు పాడి వినిపించేది. అస్తమానం రేడియో వినిపించేది. ముఖ హావభావాల్లో తప్ప నాలుగైదేళ్ల వరకు ఆమెలో పెద్ద మార్పేమీ కనిపించలేదు. సంగీతం మాస్టర్‌ను పెడితే బాగుంటుందని అనుకుని ఎంతోమంది పండితులను ఆశ్రయించింది. ఆ తర్వాత ఎంఎం రఫీ మ్యూజిక్ టీచర్‌గా వారింటికి వచ్చేందుకు ఒప్పుకున్నారు. రోజూ వచ్చి పాప ముందు గానకచేరీ చేసేవారు. పాపలో వేగంగా మార్పులు వచ్చాయి. మాస్టారితో కొద్దికొద్దిగా గొంతు కలపడం ప్రారంభించింది. ఏ సినిమాకెళ్లినా 15 నిమిషాలపాటు కుదురుగా ఉండని బెంజీ కుమార్ ఒకరోజు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన 'కహోనా ప్యార్ హై' సినిమాకెళ్లి కళ్లార్పకుండా సినిమా అంతా చూసింది. తర్వాత అనేక మంది సంగీతం టీచర్ల మధ్య బెంజీ తాను స్వతహాగా పాడడం నేర్చుకుంది. హృతిక్ రోషన్‌ను చిన్నప్పటి నుంచే గుర్తుపెట్టుకున్న ఆమె తొలి ఆడియో సీడీని హృతిక్ రోషన్‌తోనే ఆవిష్కరింపచేసింది. ఆమె మొదటి సీడీ 'కోషిష్' కాగా, తాజా ఆడియో సీడీ 'రాగ' మూడు జాతీయ అవార్డులతోపాటు ఆమె రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 'బెస్ట్ క్రియేటివ్ అడల్ట్ ఆఫ్ ఇండియా' అవార్డును అందుకున్నారు. 'సాంగ్స్ ఆఫ్ డిసేబుల్డ్, అండర్‌గ్రౌండ్ వాల్యుమ్-3' అనే అంతర్జాతీయ ఆల్బమ్‌లో చోటు సాధించారు. ఇలా ఆటిజం సమస్యను జయంచడం చాలా అరుదని, వైద్యులు చేయలేని పనిని ఓ తల్లిగా కవిత చేసే చూపించారని వైద్యులు ఆమెను ప్రశంసించారు. తన కూతురికి చేసిన మంచిని తన కూతురు లాంటి వాళ్లకు ఎందుకు చేయకూడదన్న ఆలోచన కవితా కుమార్‌కు వచ్చింది. అదే స్ఫూర్తితో ఆమె 'ధున్ ఫౌండేషన్'ను ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు సంగీతం, నృత్యం ఉచితంగా నేర్పిస్తున్నారు. బెంజీ పాటల గురించి తెలుసుకోవాలంటే 'డబ్లూడబ్లూడబ్లూ బెంజీమ్యూజిక్ డాట్ కామ్'ను చూడవచ్చు.