విభజన సమస్యలపై మళ్లీ భేటీ !

AP and Telangana CSs meeting on Monday again - Sakshi

సోమవారం సమావేశం కానున్న సీఎస్‌లు

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు, వివాదాల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కమిటీ సోమవారం తెలంగాణ సచివాలయంలో మళ్లీ సమావేశమై చర్చలు జరపనుంది. ఈ సమావేశ ఎజెండా ప్రకారం... ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాల ఆస్తుల వివాదాలపై అనుసరించాల్సిన విధానంపై తెలంగాణ చర్చించనుంది. ప్రధాన కార్యాలయం నిర్వచనంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం, సంస్థల పేరు మీద లేని భూములు, ఆస్తుల విలువ నిర్ధారణ విధానం, సొంత రాష్ట్రంలో పనిచేయని చివరి శ్రేణి ఉద్యోగులు, వేర్వేరు సబ్జెక్టులు బోధించే లెక్చరర్లు, అధ్యాపకుల పరస్పర బదిలీల్లో అనుసరించాల్సిన విధానం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ వద్ద ఉన్న నిధుల పంపకాలు, సచివాలయానికి విద్యుత్, నీటిచార్జీల బకాయిల చెల్లింపు, ఏపీపీఎస్సీ ఉద్యోగుల విభజన, టీఎస్‌పీఎస్సీకి అదనపు స్థలం కేటాయింపు, విభజన తర్వాత కేంద్రం ఏపీకి విడుదల చేసిన రూ.1,621 కోట్ల నిధుల్లో తెలంగాణ వాటా చెల్లింపు, ఈఏపీ రుణాల తిరిగి చెల్లింపుకోసం కేంద్రం ఏపీకి విడుదల చేసిన రూ.478.68 కోట్లలో రూ.108.67 కోట్ల తెలంగాణ వాటా చెల్లింపు, బాలామృతం పథకానికి ఏపీ నుంచి రావాల్సిన రూ.98.02 కోట్ల బకాయిలు, మే 2014కు సంబంధించి మద్యంపై వసూలైన పన్నులో తెలంగాణ వాటా రూ.135.98 కోట్లు, ఏపీ నుంచి రావాల్సిన రూ.141.68 కోట్ల ఏపీపీఎఫ్‌సీ బాండ్ల నిధుల బకాయిల చెల్లింపు తదితర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఏపీ ప్రభుత్వాన్ని కోరనుంది. ప్రధానంగా ఏపీ భవన్‌ ఆస్తుల బట్వాడా, ఏపీ విద్యుత్‌ సంస్థలకు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలపై చర్చించనుంది. 

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ ఎజెండాలో స్థిరాస్తులు లేని నగదు, చరాస్తులు మాత్రమే కలిగి ఉన్న 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, షీలా భిడే కమిటీ సిఫారసుల మేరకు 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థలు, పలు వివాదాలు తదితర అంశాలు ఉన్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top