
ఆణిముత్యాలుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని...
- పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి
- డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య
- జనగామలో ఇన్‌స్పైర్ కార్యక్రమం ప్రారంభం
జనగామ : విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని, బంగారు భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే కష్టపడాలని సూచించారు. పట్టణంలోని సెయింట్‌మేరీస్ పాఠశాలలో గురువారం ఆయన జిల్లాస్థాయి ఇన్‌స్పైర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇన్‌స్పైర్ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభసూచకమన్నారు.
గ్రామీణ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా పనిచేయాలని కోరారు. ‘మన విద్యాశాఖ- మన ప్రణాళిక’ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. తాను ఈస్థాయికి రావడానికి ఉపాధ్యాయుల కృషే కారణమన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో చర్యలు ముమ్మరమయ్యాయన్నారు.
నేటి బాలలే రేపటి సైంటిస్టులు
సమాజ అభివృద్ధికి సైన్సే మూలమని, నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ప్రతిభకు పేదరిక అడ్డుకాదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదవడాన్ని ఎవరూ నామోషీగా భావించవద్దన్నారు. సర్కారు బడుల్లో విద్యార్థులను చేర్పించేందుకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కృషి చేయాలని కోరారు.
ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత ఏడాది ఇన్‌స్పైర్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన నందనం జెడ్పీఎస్‌ఎస్ విద్యార్థి గణేష్‌ను సన్మానించారు. అనంతరం డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎగ్జిబిట్స్‌ను తిలకించి విద్యార్థులను అభినందించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, డీఈఓ ఎస్.విజయ్‌కుమార్, ఆర్జేడీ బాలయ్య, జిల్లా సైన్స్ అధికారి కేశవ్‌కుమార్, డిప్యూటీ డీఈఓ రేణుకాదేవి, ఎంఈఓ రాజనర్సింహాచారి, నిర్వాహణ కమిటీ కన్వీనర్ నర్పింహా రెడ్డి, మీడియా ఇన్‌చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి, కందాల రామ య్య, రమేష్, వడుప్సా నాయకులు చిర్ర ఉపేందర్‌రెడ్డి, జనగామ ఎంపీపీ బైరగోని యాదగిరిగౌడ్, జెడ్పీటీసీ బా ల్నె విజయ సిద్ధిలింగం, నాయకులు బండా యాదగిరి రెడ్డి, చీట్ల ఉపేందర్‌రెడ్డి, మేకల లింగరాజు పాల్గొన్నారు.