సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో ముడుపుల బాగోతంపై ‘సాక్షి’లో ‘ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50 వేల ముడుపులు’ శీర్షిక బుధవారం కథనం ప్రచురించడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.
కరీంనగర్ అగ్రికల్చర్/శంకరపట్నం: సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో ముడుపుల బాగోతంపై ‘సాక్షి’లో ‘ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50 వేల ముడుపులు’ శీర్షిక బుధవారం కథనం ప్రచురించడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. జిల్లాకు 172 సబ్సిడీ ట్రాక్టర్లు మంజూరు కాగా.. ఒకే కంపెనీకి చెందిన ట్రాక్టర్లను కొనుగోలు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారని, ఇందుకోసం సంబంధిత కంపెనీ డీలర్ నుంచి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50వేల చొప్పున కమీషన్ పుచ్చుకున్నారనే ఆరోపణలను ‘సాక్షి’ కథనంలో ప్రస్తావించింది.
మరోవైపు ట్రాక్టర్ల పంపిణీలో అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండడంతో తమ పేర్లు బయటకు రాకుండా అధికారులు తంటాలు పడుతున్నారు. జిల్లాలోని ఓ ఏడీఏ స్థాయి అధికారి తన పరిధిలో ట్రాక్టర్లు కేటాయించిన లబ్దిదారుల వద్దకు వెళ్లి ట్రాక్టర్ల కొనుగోలులో ముడుపుల మాట ఎత్తొద్దంటూ ప్రాధేయపడినట్లు తెలిసింది. మండలాల వారీగా సబ్సిడీ ట్రాక్టర్లు పొందిన వారి వద్దకు వెళ్లి తాము ఎవరి ఒత్తిడి లేకుండా.. స్వచ్ఛందంగానే సదరు కంపెనీ ట్రాక్టర్లు కొనుగోలు చేశామని రారుుంచుకుంటున్నట్లు సమాచారం. శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన చింతిరెడ్డి రాజిరెడ్డి సబ్సిడీ ట్రాక్టర్ పొందగా.. బుధవారం వ్యవసాయ అధికారులు ఆయన వద్దకు వచ్చి తాను స్వచ్ఛందంగానే జాన్‌డీర్ ట్రాక్టర్ తీసుకున్నానని, అధికారులు ఒత్తిడి చేయలేదని వివరణ తీసుకున్నారు. హుజురాబాద్ ఏడీఏ దామోదర్‌రెడ్డి సబ్సిడీ ట్రాక్టర్లకు ముడుపులు తీసుకున్నారనడం అవాస్తవమని ఒక ప్రకటనలో ఖండించారు. సాక్షిలో వచ్చిన కథనం నిరాధారమని పేర్కొన్నారు.
ఆ డివిజన్‌లోని హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఎల్కతుర్తి, వీణవంక, శంకరపట్నం మండలాలకు చెందిన లబ్దిదారుల సంతకాలతో సబ్సిడీ ట్రాక్టర్ల కేటాయింపులో అధికారుల ఒత్తిడి లేదని.. ఎవరికీ ముడుపులు ఇవ్వలేదని పేర్కొంటూ జేడీఏకు విన్నవించుకున్నారు. ఈ మేరకు సాక్షి కార్యాలయానికి ప్రకటన పంపించారు. ఇంకా విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ముడుపుల వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.