85.05 శాతం పోలింగ్‌..

85.05% Poling Recorded - Sakshi

కొన్నిచోట్ల మొరాయించిన ఈవీఎంలు 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు

సమస్యలు పరిష్కరించకుంటే ఓట్లేయమని ఆందోళనలు

అధికారులు నచ్చజెప్పడంతో ఓటేసిన వైనం  

సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం రెండు నెలలుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో జిల్లావ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకున్నారు. అయితే పోలింగ్‌ ప్రారంభమైన మొదటి రెండు గంటలు మాత్రం జిల్లాలోని అనేక పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. కొన్నిచోట్ల ఉదయం 10 గంటల వరకు పనిచేయకపోవడంతో అధికారులు హుటాహుటిన ప్రత్యామ్నాయ ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఈసారి పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు పెట్టిన నిబంధనల వల్ల పార్టీల శిబిరాలు పోలింగ్‌ కేంద్రాలకు దూరంగా ఏర్పాటు చేశారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పోలింగ్‌ శాతం పెరుగుతుందని భావించినా.. వికలాంగుల పోలింగ్‌ శాతం కొంత పెరిగినా.. సాధారణ పోలింగ్‌ శాతం మాత్రం గతంకన్నా కొంత తగ్గింది. ఓటర్లలో అనాసక్తి పెరగడానికి గల కారణాలపై ఎవరికి వారు తమదైన రీతిలో విశ్లేషిస్తున్నారు.

పలు రాజకీయ పక్షాలు ఓటర్లను పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ప్రలోభాలకు గురిచేయడం.. అవి అందరికీ చేరకపోవడం సైతం పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ తగ్గడానికి ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నోటాకు ఎక్కువ సంఖ్యలో ఓట్లుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నోటు రాలేదని నోటాపై మక్కువ చూపినట్లు రాజకీయ పక్షాలు చమత్కార వాగ్బాణాలు వదులుతున్నాయి. దీంతో ఏ రాజకీయ పక్షానికి ప్రయోజనం.. ఎవరి ఓట్లు నోటాకు పడ్డాయి.. అనే కోణంలో రాజకీయ కూడికలు, తీసివేతల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి.
 
విశిష్టతను చాటిన పోలింగ్‌ సరళి 
పోలింగ్‌ సరళి ఈసారి విశిష్టతను చాటింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం వరకు ఒక మోస్తారుగా కొనసాగగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి క్రమేణా పెరుగుతూ వచ్చింది. సాధారణంగా 5 గంటల వరకే పోలింగ్‌ సమయం కాగా.. తిరుమలాయపాలెం మండలం హైదర్‌సాయిపేట, సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరడంతో వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సమయం ఇచ్చారు. జిల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాలను ఆయా పార్టీల అభ్యర్థులు సందర్శించి.. ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ తదితరులు ఖమ్మంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు హక్కును వినియోగించుకోగా.. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అదే పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రధాన సంఘటనలు ఏమీ జరగకపోవడంతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయితే రఘునాథపాలెం మండలంలో కార్యకర్తలను చెదరగొడుతున్న సమయంలో ఒక పోలీస్‌ అధికారి లాఠీ కాంగ్రెస్‌ కార్యకర్తకు తగలడంతో తల పగిలింది.

ఇక పోలింగ్‌ జరిగిన తీరుపై జిల్లాలోని పలు రాజకీయ పక్షాలు తమదైన రీతిలో స్పందించాయి. ఖమ్మంలోని ఒక పోలింగ్‌ కేంద్రంలో దొంగ ఓట్లు పోలయ్యాయని, దీనికి ఆధారాలు సైతం లభించాయంటూ టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని అధికారులను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సదరు పోలింగ్‌ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడి.. నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేశారని, వారిపై చర్య తీసుకోవాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. నగరంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో పోలింగ్‌ స్లిప్‌లపై ఫొటోలు మార్చి జిరాక్స్‌ పత్రాల ద్వారా ఓటు వేసే ప్రయత్నం చేశారంటూ టీడీపీ అభ్యర్థి నామా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేయగా.. ఫిర్యాదును పరిశీలించి చర్య తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
 
85.05 శాతం పోలింగ్‌.. 
ఈ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 85.05 శాతం పోలింగ్‌ జరిగినట్లు ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. ఉదయం 6 గంటల వరకు ఎన్నికల సిబ్బంది సామగ్రిని సిద్ధం చేసుకుని.. 6.30 గంటలకు ఆయా పార్టీల ఏజెంట్ల ఎదుట మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో.. ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పూర్తయ్యాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ పోలింగ్‌ సరళిని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. కలెక్టర్‌ నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల పోలింగ్‌ బూత్‌.. సిద్ధారెడ్డి కళాశాలలోని పోలింగ్‌ బూత్‌లను పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌తో కలిసి పరిశీలించారు.
 
మొరాయించిన ఈవీఎంలు.. 

జిల్లావ్యాప్తంగా పలు పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. సత్తుపల్లిలోని జేవీఆర్‌ డిగ్రీ కళాశాల పోలింగ్‌ బూత్, కిష్టారంలోని పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో గంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. వైరా నియోజకవర్గ కేంద్రమైన వైరాతోపాటు గుండ్రాతిమడుగు, కారేపల్లి, కొణిజర్ల ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్‌ ఏజెంట్లు అధికారులకు సమాచారం ఇచ్చి పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చూశారు. తిరుమలాయపాలెం మండలం హైదర్‌సాయిపేట పోలింగ్‌ బూత్‌ వద్ద సాయంత్రం 5 గంటలకు ఈవీఎం మొరాయించింది. దీంతో అప్పటి వరకు పోలింగ్‌ బూత్‌లో 300 మంది వరకు క్యూలో ఉన్నారు. మళ్లీ 6 గంటలకు ఈవీఎంలు పనిచేయడంతో వారితో ఓట్లు వేయించారు.

మధిర మండలం మహదేవపురం, మధిరలోని హరిజనవాడ, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వాటి స్థానంలో కొత్తవి అమర్చి ఉదయం 8.30 గంటలకు మళ్లీ పోలింగ్‌ ప్రారంభించారు. ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్‌ నిర్మల్‌ హృదయ్‌ ప్రాథమిక పాఠశాలలోని 109 పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ఉదయం 40 నిమిషాలపాటు మొరాయించింది. మహిళా డిగ్రీ కళాశాలలోని 179వ పోలింగ్‌ బూత్‌లో ఉదయం 9.17 గంటల సమయంలో ఈవీఎం మొరాయించడంతో అధికారులు ఓటింగ్‌ ప్రక్రియను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి నామా బూత్‌లోకి వెళ్లి ప్రిసైడింగ్‌ అధికారితో మాట్లాడారు. ఎంత సేపటికీ మిషన్‌ పనిచేయకపోవడంతో మరో ఈవీఎంను ఏర్పాటు చేసి.. 45 నిమిషాల తర్వాత ఓటింగ్‌ను ప్రారంభించారు.
 
ఆందోళనలు ..
తమ సమస్యలను పరిష్కరించకుంటే ఓట్లు వేసే ప్రసక్తి లేదని కొందరు ప్రజలు ఆందోళనకు దిగారు. ఖమ్మంలోని 26వ డివిజన్‌లో స్థానికులు తమ ప్రాంత సమస్యలను పరిష్కరించలేదని.. ఓటింగ్‌ను బహిష్కరిస్తామని ఆందోళన చేపట్టారు. స్థానిక నేతల హామీతో ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించే వరకు ఓటు వినియోగించుకోమన్నారు. ఏన్కూరు మండలం పీకే తండాలో సీసీ రోడ్డు నిర్మించాలంటూ ఆందోళన చేయడంతో ఎస్సై పవన్‌ హామీతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

జూలూరుపాడు మండలం నల్లబండబోడు గ్రామస్తులు అనంతారం–నల్లబండబోడు గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ సుమారు రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు. తహసీల్దార్‌ రమేష్‌ హామీతో ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నా రు. బేతాళపాడు, పాపకొల్లు గ్రామస్తులు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళన చేసి.. నిరసన వ్యక్తంచేశారు. అధికారుల హామీతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top