
‘స్థానిక’ ఎన్నికలకు కొత్త ఈవీఎం మెషిన్లు కొనుగోలు యోచన!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలు జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 17వ తేదీతో, పంచాయతీల సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణ ప్రాథమిక కసరత్తుపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని మంగళవారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు.
ఎన్నికల నిర్వహణ ప్రణాళికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఖరారు చేసి, ఆ వివరాలను ఈ నెల 3వ తేదీనే ప్రభుత్వానికి తెలియజేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. అక్టోబరు 15 నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల విలీన ప్రక్రియను మొదలుపెట్టి నవంబర్ 15 నాటికి పంచాయతీ, మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాల్సి ఉంది.
నవంబర్ 30లోగా పోలింగ్ బూత్‌ల నిర్ధారణ, డిసెంబర్ 15 నాటికి వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు, డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశం పూర్తి చేసి, జనవరిలో ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. స్థానిక సంస్థల ముందస్తు ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు కూడా తెలియజేయడంతో ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం జరిగే సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
పంచాయతీ ఎన్నికలు ఈవీఎంలతోనే..
రాష్ట్రంలో తొలిసారి గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవులకు కూడా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించే సమావేశంలో కొత్త ఈవీఎంల కొనుగోలుపైనా ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈవీఎం మెషిన్లు సరఫరా చేసే ఈసీఐఎల్ అధికారులు ఆ సమావేశంలో పాల్గొంటారని సమాచారం. రాష్ట్రంలోని పంచాయతీల్లో మొత్తం 1.37 లక్షల వార్డులు ఉండగా.. నాలుగు దఫాల్లో పంచాయతీ ఎన్నికలు జరిపినా 35–40 వేల ఈవీఎంల అవసరం ఉంటుంది. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద 8 వేల ఈవీఎంలు ఉండగా, వాటిలో ఎన్ని పనిచేస్తాయో పరిశీలించాలని అధికార వర్గాలు తెలిపాయి.