సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5% కోటా

5% quota to Handicaps for welfare schemes - Sakshi

విద్య, ఉద్యోగ అవకాశాల్లో 4 శాతం రిజర్వేషన్లు: తుమ్మల 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం కేటాయిస్తున్నట్లు మహిళాభివృద్ధి, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని.. ఉద్యోగ, విద్యావకాశాల్లో 3 శాతమున్న రిజర్వేషన్లను 4 శాతానికి పెంచిందని గుర్తుచేశారు. ఆదివారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీతో కలిసి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికలాంగ విద్యార్థులకు వాహనాలు, యంత్రాలు అందించేందుకు ప్రభుత్వం అపరిమితంగా నిధులు ఖర్చు చేస్తోందని చెప్పారు.

వికలాంగుల పెళ్లి ప్రోత్సాహక నిధులకు రూ.10 కోట్లు విడుదల చేశామని, జిల్లాల వారీగా వాటిని పంపిణీ చేశామని, త్వరలో లబ్ధిదారులకు చేరవేస్తామని వెల్లడించారు. దివ్యాంగుల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కల్పనకు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఐటీ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం మామిడిపల్లిలో పదెకరాల స్థలం కేటాయించామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమంలో భాగంగా తనవంతు సహాయంగా రూ.15 లక్షలు ఆ శాఖకు అందించానని.. వికలాంగులకు డిజిటల్‌ లైబ్రరీ, బ్రెయిలీ యంత్రాల కోసం వాటిని ఖర్చు చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వికలాంగులకు రూ.1,500 పెన్షన్‌ ఇస్తున్నామని, వికలాంగుల సమస్యలను ఆలకించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. 

హెచ్‌ఎంఆర్‌ ఎండీకి సత్కారం 
వికలాంగుల మనసు నిర్మలమైనదని, కల్మషం లేకుండా కలివిడిగా ఉంటారని సినీనటి జీవిత అన్నారు. వికలాంగుల సమస్యలు, వారి మేధస్సు తెలిపేందుకు పలు చిత్రాల్లో వారి క్యారెక్టర్‌కు ప్రాధాన్యమిచ్చానని సినీ దర్శకుడు అనిల్‌ రావిపూడి చెప్పారు. అనంతరం వికలాంగుల కోసం కృషి చేసిన సంస్థలు, ఉద్యోగులకు అవార్డులు అందించారు. మెట్రో రైళ్లో వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకుగాను హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డిని మంత్రులు సత్కరించారు. కాగా, ఉత్సవాలకు భారీగా వికలాంగులు హాజరుకావడంతో కొంత గందరగోళం నెలకొంది. జనాభాకు తగినట్లు ఏర్పాట్లు చేయకపోవడంతో కొందరు నిరసన వ్యక్తం చేశారు. అయితే అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌ కె.వాసుదేవరెడ్డి, ఆ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, కమిషనర్‌ బి.శైలజ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top