కబ్జా@:30,000 ఎకరాలు | 30,000 acres are in khabja | Sakshi
Sakshi News home page

కబ్జా@:30,000 ఎకరాలు

Dec 7 2014 12:45 AM | Updated on Mar 28 2018 11:11 AM

ఎట్టకేలకు భూ ఆక్రమణల లెక్క కొలిక్కివచ్చింది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూముల కబ్జాలపై యంత్రాంగం గణాంకాలు సిద్ధం చేసింది.

ఎట్టకేలకు భూ ఆక్రమణల లెక్క కొలిక్కివచ్చింది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూముల కబ్జాలపై యంత్రాంగం గణాంకాలు సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరించాలని యోచిస్తున్న సర్కారు.. ఆక్రమణల జాబితాను రూపొందించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. భూముల వేలం, స్థలాల క్రమబద్ధీకరణతో ఖజానాను పరిపుష్టి చేసుకోవాలని భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇదొక్కటే మార్గమని భావిస్తోంది.

ఈ తరుణంలోనే క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమైన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే 9న సీఎస్ రాజీవ్‌శర్మ నేతృత్వంలో జరిగే సమావేశంలో క్రమబద్ధీకరణకు విధి విధానాలను ఖరారు చేస్తారు. దీంతో యంత్రాంగం ఆగమేఘాలమీద ప్రభుత్వ స్థలాలు, కబ్జాల వివరాలపై కుస్తీ పడుతోంది.
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజధాని చేరువలో ఉండడం, నగరీకరణ నేపథ్యంలో జిల్లాలో విలువైన భూములు అక్రమార్కుల చెరలో చిక్కుకున్నాయి. మరికొన్ని చోట్ల పేదలు గుడిసెలు, ఇళ్లు నిర్మించుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 30వేల ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు యంత్రాంగం తేల్చింది. వ్యవసాయ, వ్యవసాయేతర, యూఎల్‌సీ, అసైన్డ్ భూముల  కబ్జాపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారగణం.. తుది కసరత్తు చేస్తోంది. మొయినాబాద్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, హయత్‌నగర్ మండలాలకు సంబంధించిన రికార్డులకు, స్థానిక అధికారులు ఇచ్చిన సమాచారానికి పొంతనలేకపోవడంతో రీ వెరిఫై చేయాలని ఆదేశించడంతో జాబితా తుది రూపులో ఆలస్యం జరిగిందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు 18,130.17 ఎకరాలుండగా, యూఎల్‌సీకి సంబంధించి 2వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు యంత్రాంగం తేల్చింది.

భారీగా అంచనాలు!
స్థలాల క్రమబద్ధీకరణ కాసుల వర్షం కురిపిస్తుందని ఆశిస్తున్న ప్రభుత్వం.. మన జిల్లా భూములపైనే గంపెడాశలు పెట్టుకుంది. భూముల అమ్మకంతో రూ.6500 కోట్లు సమకూర్చుకుంటామని బడ్జెట్‌లో పొందుపరిచిన సర్కారు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకాలకు నిధులను ఇక్కడి నుంచే సమకూర్చుకోవాలని నిర్ణయించింది. భూములను అమ్ముతున్నారనే అపవాదురాకుండా పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా రె గ్యులరైజ్ చేయాలని భావిస్తోంది.

గతంలో కనీస ధరలో 2.5శాతం చెల్లించడం ద్వారా స్థలాల యాజమాన్య హక్కులు కల్పించిన ప్రభుత్వం... ఇప్పుడు మాత్రం పేదల స్థలాల అమ్మకాలపై నియంత్రించాలని నిర్ణయించింది. 80 గజాల్లోపు ఉచితంగా క్రమబద్ధీకరించే స్థలాల విక్రయాలను నిషేధించాలని యోచిస్తోంది. దీనిపై ఈ నెల 9న జరిగే సమావేశంలో విధానపర నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఉచితంగా స్థలాలను క్రమబద్ధీకరిస్తుండడంతో అవి చేతులు మారుతున్నాయని, మరోచోట కబ్జాలు చేస్తున్నారని పరిశీలనలో గుర్తించిన ప్రభుత్వం.. ఈ కొత్త నిబంధనను పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో భూమిలేని పేదలకు పంపిణీ చేసిన 1.80 లక్షల ఎకరాల్లో 10వేల ఎకరాల వరకు ఇతరుల గుప్పిట్లోకి వెళ్లినట్లు గుర్తించింది.

పీవోటీ చట్టం ప్రకారం వీటిని వెనక్కి తీసుకునే అవకాశమున్నప్పటికీ, నగర శివార్లలోని ఈ భూములు బస్తీలుగా అవతరించడంతో స్వాధీనం చేసుకోవడం ఆషామాషీ కాదని తేల్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో వీటిని క్రమబద్ధీకరించే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. భారీగా వెలసిన ఆక్రమణలు తొలగించడం సాధ్యం కాదు కనుక.. ఖజానా నింపుకోవడమే మేలనే ద్విముఖ సూత్రాన్ని అమలు చేస్తున్న సర్కారు.. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు జీఓను తీసుకోవడం క్రమబద్ధీకరణకు తెరలేపాలని భావిస్తోంది.

కటాఫ్ అపాయింటెడ్ డే!
క్రమబద్ధీకరణకు తెలంగాణ రాష్ర్ట అపాయింటెడ్ డేను కటాఫ్ తేదీగా తీసుకునే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరణకు 2014 జూన్ 2వ తేదీని ప్రామాణికంగా (కటాఫ్ డేట్)ను తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా గతంలో నిర్దేశించినట్లు కనీస విలువ కాకుండా.. ఇప్పటి బేసిక్ రేట్ అనుగుణంగా స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని భావిస్తోంది. స్థల విస్తీర్ణాన్ని బట్టి క్రమబద్ధీకరణ భూముల విలువను శ్లాబ్‌ల వారీగా నిర్ణయించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement