కాంగ్రెస్‌లో ‘డీఎస్‌’ కలకలం..

Do Not Give Priority To Reaching Party - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ‘‘ఆయారాం.. గయారాంలు మళ్లీ వస్తున్నారు.. కష్ట కాలంలో పార్టీని పట్టుకుని ఉన్నాము.. మమ్మల్ని కాదని కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వద్దు..’’ అంటూ పరోక్షంగా రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్‌ను ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం సోమవారం నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో జరిగింది.

మొదట కార్యకర్తలనుద్దేశించి ముఖ్య నేతల ప్రసంగాలు కొనసాగాయి. అనంతరం పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌ నియోజకవర్గాల వారీగా అంతర్గతంగా సమీక్ష నిర్వహించారు. బూత్‌ స్థాయి నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ అంతర్గత సమీక్షకు సంబంధిత నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం సమీక్ష సందర్భంగా పరోక్షంగా డీఎస్‌ను ఉద్దేశించి స్థానిక నాయకులు పరోక్షంగా ప్రస్తావించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానించిన నేపథ్యంలో డీఎస్‌ పార్టీ మారుతారనే చర్చ జోరుగా సాగుతోంది.

తిరిగి ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో డీఎస్‌ తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తే తమ పరిస్థితి ఏంటని ఆయన వ్యతిరేకవర్గం ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో అర్బన్‌ నాయకులు.. తిరిగి పార్టీలోకి వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వద్దని ఆ పార్టీ ఇన్‌చార్జి దృష్టికి తీసుకెళ్లడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఇది పార్టీ అధిష్టానం పరిధి లోని అంశమని  పార్టీ ఇన్‌చార్జ్‌ పేర్కొన్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top