ఇద్దరు నేతలను జేఏసీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది.
ఇద్దరు టీజేఏసీ నేతల సస్పెన్షన్
Mar 7 2017 3:14 PM | Updated on Sep 5 2017 5:27 AM
హైదరాబాద్: తమ నేతలు పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్ ను జేఏసీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ) ప్రకటించింది. మంగళవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజల సమస్యలు పరిష్కరించే బదులు, ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న శక్తులను బలహీన పరచాలని నేతలు ప్రయత్నించారని ఆరోపించింది. దీనికోసం అనైతిక పద్ధతుల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపింది. ప్రజాస్వామిక విలువలపై కనీస గౌరవమున్న వారు చేసేపని ఇది కాదని పేర్కొంది. దీంతో పాటు ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణిని ఖండించింది.
ప్రభుత్వ ప్రలోభాలకు తలొగ్గి కొందరు చేస్తున్న ప్రకటనలతో జేఏసీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని, వీటివల్ల జేఏసీ తన కార్యాచరణను మరింత బలంగా ప్రజలలోకి తీసుకుపోవడానికి అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడింది. నిరుద్యోగ నిరసన ర్యాలీ తదనంతర పరిణామాలపై టీజేఏసీ ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఆ ర్యాలీ విజయవంతం కావడం, జేఏసీ ప్రజల బలమైన గొంతుకగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని పాలకులు తమ కుట్రలను తీవ్రతరం చేశారని ఆరోపించింది.
కాగా, కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీ ఫీజులు యథేచ్ఛగా పెంచుతుండటంతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని, అయితే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం చట్ట పరిధిలో ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫీజుల నియంత్రణకు కార్యాచరణ చేపట్టాలని జేఏసీ నిర్ణయించినట్లు వెల్లడించింది. బడ్జెట్ ను అధ్యయనం చేసి బలహీన వర్గాలకు కేటాయించిన నిధుల తరలింపును వెలుగులోకి తేవాలని జేఏసీ తీర్మానించింది. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లాల యాత్రలు చేపట్టాలని, దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే నిర్ణయించి ప్రకటించనున్నట్లు వివరించింది.
Advertisement
Advertisement