పార్లమెంట్ సమావేశాలు, స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల నేపథ్యంలో పార్లమెంట్ హౌస్‌కు పరిసరాల్లో ఉన్న కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో భద్రతను పెంచుకోవాలని ఢిల్లీ పోలీసులు కోరారు.
పార్లమెంట్ హౌస్ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం
Aug 4 2013 10:57 PM | Updated on Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు, స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల నేపథ్యంలో పార్లమెంట్ హౌస్‌కు పరిసరాల్లో ఉన్న కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో భద్రతను పెంచుకోవాలని ఢిల్లీ పోలీసులు కోరారు. ఇంటెలిజెన్స్ విభాగాల హెచ్చరికల నేపథ్యంలో పార్లమెంట్ సమీపంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆయా భవనాల్లోకి ప్రవేశించే ప్రతివ్యక్తిని తనిఖీ చేయాలని కోరారు. రేల్ భవన్, ఆర్‌బీఐ, గురుద్వారా రాకబ్ గంజ్, అల్ ఇండియా రేడియోలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
పభుత్వ వాహనాలు, దుస్తుల్లో వచ్చే వారిపై ప్రత్యేక నిఘా వేసి ఉంచాలని నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎస్‌బీఎస్ త్యాగి కోరారు. అలాగే పార్లమెంట్ హౌస్ సమీపంలోని అన్ని భవనాల ప్రాంగణాల్లో తనిఖీలు చేస్తున్నామని, అక్కడే రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలను కూడా తొలగిస్తున్నామన్నారు. అయితే బెదిరింపు హెచ్చరికల విషయాలను వెల్లడించేందుకు నిరాకరించారు. పార్లమెంట్ సభలు జరిగే సమయంలో అసాంఘిక శక్తులు అరాచకం సృష్టించే అవకాశం ఉందని ఆయన అన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సభలు ప్రారంభం కానున్నాయి.
అయితే దాడులు చేసేందుకు ప్రభుత్వ వాహనాలు, దుస్తులు ఉపయోగించే అవకాశం ఉందన్నారు. ఇలాంటివాటిని నిలువరించేందుకు అందరూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు. 2001, డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి సమయంలో ఆయుధాలు కలిగిన ఐదుగురు ఉగ్రవాదులు తెల్లటి అంబాసిడర్ కారును ఉపయోగించారని, దానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నకిలీ స్టిక్కర్‌ను కూడా వినియోగించారని గుర్తు చేశారు.
Advertisement
Advertisement