అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత భౌతికకాయాన్ని నేరుగా సందర్శించి అంజలి ఘటించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ శశికళ మంగళవారం ఉత్తరాలు రాశారు.
► రాష్ట్రపతికి, ప్రధానికి శశికళ లేఖలు
► శశిహోదాపై చర్చ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత భౌతికకాయాన్ని నేరుగా సందర్శించి అంజలి ఘటించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ శశికళ మంగళవారం ఉత్తరాలు రాశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, అఖిల భారత కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలకు ఆమె లేఖలు పంపారు.
రాష్ట్రపతి ప్రణబ్‌కు...
జయ అంత్యక్రియల్లో నేరుగా పాల్గొని ప్రత్యేకమైన రీతిలో తనను ఓదార్చినందుకు కృతజ్ఞతలు. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినా చెన్నైకి చేరుకుని జయకు అంజలి ఘటించడం నాకేగాక తమిళనాడు ప్రజలకు సైతం ఎంతో ఓదార్పు నిచ్చింది. తాను క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో నేరుగా వచ్చి ఓదార్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ప్రధాని మోదీకి..
మా అభిమాన పురట్చితలైవి అమ్మ కు అంజలి ఘటించేందుకు మీరు స్వయంగా చెన్నైకి రావడం నాకు ఎంతో ఓదార్పు కలిగించింది. లక్షలాది తమిళనాడు ప్రజల ఆవేదనను తీర్చినవాళ్లయ్యారు. జయ మరణం తో ఏర్పడిన తీరని ఆవేదనను నాతో కూడా మీరు పంచుకున్నారు. మీ రా కకు, మీరు చూపిన ఆదరణకు నా త రఫున, తమిళనాడు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
రాహుల్‌గాంధీకి..
జయలలిత అంత్యక్రియలకు నేరుగా హాజరై నివాళులర్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరుచెన్నైకి వచ్చిన సమయంలో చెప్పిన మాటలు ఆవేదనతో ఉన్న నాకు ఎంతో ఊరటనిచ్చాయి. ఏ హోదాలో ఉత్తరాలు:పార్టీలనూ, ప్రభుత్వంలోనూ ఎలాంటి కీలక బాధ్యతల్లోలేని శశికళ ఏకంగా రాష్ట్రపతి, ప్రధానికి ఉత్తరాలు రాయడం చర్చలకు తెరదీసింది. కచ్చదీవుల్లోని అంతోనియర్ ఆలయ ఉత్సవాలకు తమిళనాడు నుంచి వందమందిని అనుమతించాల్సిందిగా కోరుతూ శ్రీలంక అధ్యక్షునికి శశికళ ఇటీవలే ఒక ఉత్తరం రాయడం, శశికళ విజ్ఞప్తిని మన్నించడం జరిగిపోయింది. ఈలోగా రాష్ట్రపతి, ప్రధానిలకు సైతం శశికళ స్వయంగా రాయడం మరోసారి విమర్శకుల నోళ్లకు పనిచెప్పింది. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేయాల్సిన పనిని శశికళ నెరవేర్చడం గమనార్హం.