మాతాశిశు మరణాల రేటు తగ్గించాలి | Reduce the mortality rate matasisu | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాల రేటు తగ్గించాలి

Jul 12 2014 3:04 AM | Updated on Sep 2 2017 10:09 AM

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో తల్లి-శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని, దీనిని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో తల్లి-శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని, దీనిని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈ దిశగా ఆశా కార్యకర్తలు సమర్థంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని విధాన సౌధలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భౌగోళిక ప్రదేశం పెరగదని చెబుతూ, దీని వల్ల నివాస, నీటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. కనుక జన సంఖ్య విషయంలో స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశంలో ఏటా 1.92 కోట్ల జనాభా పెరుగుతోందని తెలిపారు. ఇదే పెరుగుదల కొనసాగితే వచ్చే 40 ఏళ్లలో మన దేశ జనాభా 240 కోట్లకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఏటా ఎనిమిది లక్షల చొప్పున జనాభా పెరుగుతోందన్నారు. 1951లో 1.94 కోట్లు ఉన్న జనాభా 2011 నాటికి 6.11 కోట్లకు చేరుకుందని వెల్లడించారు.  ఒక కుటుంబానికి ఒకరు లేక ఇద్దరు ఆరోగ్యవంతమైన పిల్లలు ఉండాలనేది ప్రభుత్వ ఆశయమని చెప్పారు. రాష్ట్రంలో ఆశా కార్యకర్తలు సమర్థంగా పని చేస్తున్నారని జనాభా నియంత్రణ, తల్లి-శిశు మరణాల రేటు తగ్గింపులో వీరి పాత్ర అమోఘమని ఆయన కొనియాడారు.
 
కార్యకర్తలకు ఆరోగ్య బీమా

రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలకు ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం రోజే ఆశా కార్యకర్తల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. కార్యకర్తల అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమర యోధుడు హెచ్‌ఎస్. దొరస్వామి ప్రభృతులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement