రాజధానివాసులకు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు అమాంతంగా కేజీకి రూ.50కి పెరగడంతో నగరవాసులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
అమాంతంగా పెరిగిన ఉల్లి ధరలు
Aug 5 2013 10:52 PM | Updated on Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: రాజధానివాసులకు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు అమాంతంగా కేజీకి రూ.50కి పెరగడంతో నగరవాసులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే టమాటా, పప్పు ధాన్యాలు, ఇతర కాయగూరల ధరలతో బెంబేలెత్తుతున్న నగరవాసులకు ఉల్లి ఘాటు మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. వర్షాల కారణంగా రాజస్థాన్, మహారాష్ట్రలోని నాసిక్ నుంచి వచ్చే ఉల్లి సరఫరా నిలిచిపోవడంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి. మదర్ డెయిరీ సఫల్ అవుట్‌లెట్‌లో రూ.40లకు కేజీ దొరుకుతున్న ఉల్లిని స్థానిక వ్యాపారులు రూ.50లకి విక్రయిస్తున్నారు.
ఢిల్లీ అజాద్‌పూర్ మార్కెట్‌లో హోల్‌సేల్ రేట్ ఉల్లి కేజీకి రూ.25 నుంచి 35కి పెరిగిందని ఉల్లి వ్యాపారి సంఘాల అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్ర బుదిరాజ్ తెలిపారు. వారం క్రితం రూ.18 నుంచి 28లకి పెరిగిందని గుర్తు చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల రాజస్థాన్, లాసల్‌గావ్ నుంచి వచ్చే ఉల్లిగడ్డల సరఫరా తగ్గిపోయిందని అన్నారు. కొత్త పంట మార్కెట్‌లోకి వస్తే ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పడతాయన్నారు.
సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి కొత్త పంట అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. అయితే అక్టోబర్‌లో కర్ణాటక నుంచి పంట మార్కెట్‌కు వస్తే ధరలు తగ్గుతాయని వివరించారు. జాతీయ ఉద్యానవన పరిశోధన మరియు అభివృద్ధి ఫౌండేషన్ గణాంకాల ప్రకారం...ఢిల్లీ, లాసల్‌గావ్‌లో గత నెల నుంచి ఉల్లి హోల్‌సేల్ ధరలు రూ.50 శాతం మేర పెరిగాయి. లాసల్‌గావ్ మండిలో జూలై తొలి వారంలో ఉల్లి రూ.16 నుంచి 17కి పెరిగింది. ప్రస్తుతం కేజీ రూ.30కి చేరుకుంది.
Advertisement
Advertisement