వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. చెన్నై నాగపట్టణం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం
Aug 6 2013 12:03 AM | Updated on Aug 30 2018 3:56 PM
వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. చెన్నై నాగపట్టణం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నరిణంపుదుపల్లం సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అలాగే చెంగల్‌పట్టు సమీపం ఏడాలం జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : తంజావూరు జిల్లా ఓరత్తనాడు కణ్ణన్‌కుడి ప్రాంతానికి చెందిన మణిమారన్ (29), సతీస్ కుమార్(27), లక్ష్మీ కందన్ (29), శరవణన్ (28), ఇళయరాజ (28) స్నేహితులు. వీరు తాంబరం పెరుంగళత్తూరులోని అద్దె ఇంటిలో ఉంటూ శ్రీ పెరుంబుదురూర్, తాంబరం తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి ముట్టుకాడులో సినిమా చూసేందుకు కారులో వెళ్లారు. సినిమా చూసిన అనంతరం కారులో బయలుదేరారు. ముట్టుకాడు బస్‌స్టాపింగ్ సమీపంలో కారు వేగంగా వస్తున్న సమయంలో హఠాత్తుగా పశువు రోడ్డపైకి వచ్చింది. డ్రైవర్ హఠాత్తుగా బ్రేకులు వేయడంతో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మణిమారన్, కృష్ణకుమార్ ఇద్దరూ సంఘటనా స్థలంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని స్థానికులు కేళంబాక్కం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న అడయార్ ట్రాఫిక్ పోలీసు ఇన్‌స్పెక్టర్ రవికుమారన్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నాగపట్టణం నరిమణం పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ నాగలింగం (50), అదే ప్రాంతానికి చెందిన రైతు భక్తవత్సలం (55) కలసి ఆదివారం రాత్రి నాగైకు బైకులో బయలు దేరారు.అలాగే తిరుచ్చి పెరియార్ నగర్‌కు చెందిన 8 మంది ఆమ్ని వ్యాన్‌లో వేలాంగనికి పర్యాటనకు వెళ్లి అక్కడ నుంచి కారైకాల్‌కు వెళుతున్నారు. నరిణంపుదుపల్లం సమీపంలో వెళ్తుండగా బైకును వ్యాన్ ఢీకొనింది. ఈ ప్రమాదంలో బైకులో వెళ్తున్న నాగలింగం భక్తవత్సలం ఇద్దరూ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్ మరియసూసై, వ్యాన్‌లో ప్రయాణిస్తున్న విజయ్ (19)లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నాగపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విజయ్ మృతి చెందాడు. పోలీసులు కేసువిచారణ జరుపుతున్నారు.
వ్యానును ఢీ కొన్న కారు
కొరుక్కుపేట: చెంగల్‌పట్టు సమీపంఏడాలం జంక్షన్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుచ్చి నుంచి చెన్నైకు వస్తున్న కారు చెంగల్‌పట్టు సమీపంలోని జీఎన్‌శెట్టి రోడ్డు, ఏడాలం జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొనింది. అదే సమయంలో పాడిలోని మేల్‌మలైయనూర్‌లోని అంగాలమ్మన్ ఆలయానికి వెళ్తున్న వ్యానును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు, మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యానులో ప్రయాణిస్తున్న 16 మంది గాయపడ్డారు. పాత పెరుంగలత్తూర్‌కు చెందిన జే విజ్ఞాశ్వరన్(26) తల్లిదండ్రులు సరళామణి (48),జ్యోతిలింగం(62)లతో కలసి తిరుచ్చి వెళ్లాడు. తిరిగి కారులో ఇంటికి వస్తున్నారు. కారును విజ్ఞాశ్వరన్ నడుపుతున్నారు. ఏడాలం వద్ద రోడ్డు దాటుతున్న ఎస్‌దానం(40) అనే మహిళను కారు ఢీ కొనింది. అదుపు తప్పిన కారు ఎదురుగా వస్తున్న వ్యానును కూడా ఢీ కొనింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు,కారు ఢీకొన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యానులో ఉన్న 16 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని చెంగల్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పడాలం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement